హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలుగు నటుడు సత్యదేవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఓ పోడ్కాస్ట్‌లో పాల్గొన్న ఆయన.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు తమ రాజకీయ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడం అంత సులువు కాదని స్పష్టంగా చెప్పారు. ప్రేక్షకులందరినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సి వస్తుందని, అందుకే చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందని వెల్లడించారు.
పబ్లిక్ ఫిగర్‌గా ఉండటం అంటే ప్రతి విషయంపైనా నిజాయితీగా మాట్లాడే అవకాశం ఉండదని సత్యదేవ్ అన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో నిజంగా ఏమనిపిస్తుందో అలా బయట చెప్పడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులూ చూడాలని కోరుకునే సమయంలో రాజకీయాల విషయంలో ఓపెన్‌గా మాట్లాడితే అది ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెప్పారు.
ప్రేక్షకులు అన్ని వర్గాల నుంచి వస్తారని, తమ పని సినిమా తీసి వాళ్లందరికీ చేరవేయడమేనని సత్యదేవ్ వివరించారు. అందుకే ఒక్క ప్రేక్షకుడినైనా కోల్పోకుండా ఉండాలంటే మాటల్లో చాలా జాగ్రత్త అవసరమని అన్నారు. అదే ఇండస్ట్రీలో భాగంగా ఉండే ఒక రకమైన ప్రోటోకాల్ అని, డిప్లమసీ లేకుండా ఇక్కడ కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డారు.
ఒకవేళ తాను ఏదైనా రాజకీయ వైపు బహిరంగంగా నిలబడాలంటే.. ఏదైనా వచ్చినా పట్టించుకోకుండా ఉండేంత ఆర్థిక స్థోమత ఉండాలని కూడా సత్యదేవ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన ఆలోచనలను పూర్తిగా బయట పెట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఒకసారి ఏదైనా అంశంపై స్పందిస్తే, తర్వాత ప్రతి విషయంపైనా స్పందించాలని ఒత్తిడి పెరుగుతుందని కూడా ఆయన అంగీకరించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సత్యదేవ్ ఇటీవల కింగ్‌డమ్ చిత్రంలో నటించారు. అలాగే డ్రైవ్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. అరేబియా కడలి వెబ్ సిరీస్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రావు బహదూర్, ఫుల్ బాటిల్, గరుడ: చాప్టర్ వన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా సత్యదేవ్ చేసిన ఈ కామెంట్స్ మాత్రం ఇండస్ట్రీలో నటులు ఎదుర్కొనే ఒత్తిడిపై మరోసారి చర్చ మొదలయ్యేలా చేశాయి.