జూన్ నెలలో వివాహానంతర యాత్ర లేదా కుటుంబ విహారయాత్రకు సిద్ధమవుతున్న వారికి చల్లని వాతావరణం, ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణాన్ని అందించే పర్వత ప్రాంతాలు ఉత్తమ ఎంపికగా నిలుస్తాయి. మండే ఎండల నుంచి ఉపశమనం పొందుతూ మేఘాల మధ్య సేదతీరాలని, పచ్చని ప్రకృతి ఒడిలో మరపురాని జ్ఞాపకాలు సృష్టించుకోవాలని భావిస్తున్నవారు ఈ కాలంలో కొన్ని ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. జూన్ నెలలో వర్షాకాలం ప్రారంభమయ్యే వేళ దేశంలోని పలు కొండ ప్రాంతాలు మరింత అందంగా మారి పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.
వేసవి ముగింపు సమయంలో తప్పక సందర్శించాల్సిన ప్రాంతాల్లో లడఖ్ మొదటి వరుసలో ఉంటుంది. జూన్ నెలలో ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచుతో అలంకరించబడిన పర్వతాలు, విశాలమైన భూభాగాలు, నిర్మలమైన ఆకాశం, ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ముఖ్యంగా పాంగోగ్ సరస్సు, నుబ్రా లోయ, ఎత్తైన పర్వత శ్రేణులు సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి. ఫోటోగ్రఫీ ప్రియులకు కూడా ఇది స్వర్గధామంగా చెప్పవచ్చు.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జూన్ నెలలో మరింత అందంగా కనిపిస్తుంది. కొండల రాణిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం పొగమంచు, చిరుజల్లులు, పచ్చని ప్రకృతి అందాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎత్తైన కొండలు, సుందరమైన జలపాతాలు, టీ తోటలు, అడవి ప్రాంతాల మధ్య ప్రయాణం చేసే అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా సమయం గడపాలనుకునేవారికి డార్జిలింగ్ ఉత్తమ గమ్యస్థానంగా నిలుస్తుంది.
తమిళనాడులోని ఊటీ కూడా జూన్ నెలలో సందర్శించడానికి అత్యంత అనుకూలమైన ప్రదేశాల్లో ఒకటి. చల్లని గాలులు, ఉదయం వేళల్లో కనిపించే పొగమంచు, పచ్చని కొండలు ఈ ప్రాంతానికి ప్రత్యేక అందాన్ని తీసుకొస్తాయి. కొండల మధ్యుగా సాగే రైలు ప్రయాణం, సొరంగ మార్గాలు, పచ్చని తోటలు, సహజ సౌందర్యం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ప్రకృతి ప్రేమికులకు ఊటీ ఎప్పటికీ ప్రత్యేకమైన అనుభూతిని అందించే ప్రాంతంగా నిలుస్తోంది.
కేరళలోని మున్నార్ ప్రకృతి సోయగాలకు నిలయంగా పేరుగాంచింది. జూన్ నెలలో ప్రారంభమయ్యే వర్షాకాలం ఈ ప్రాంతాన్ని మరింత అందంగా మారుస్తుంది. మేఘాలతో కప్పబడిన కొండలు, చల్లని గాలులు, విస్తారమైన తేయాకు తోటలు సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదించాలని కోరుకునేవారికి మున్నార్ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.
కర్ణాటకలోని కూర్గ్ కూడా జూన్ నెలలో విహారయాత్రకు అనువైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు సాధారణంగా 14 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండటంతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పొగమంచుతో కప్పబడిన కాఫీ తోటలు, చిరుజల్లులు, పచ్చని ప్రకృతి దృశ్యాలు పర్యాటకులకు విశేషమైన ఆనందాన్ని అందిస్తాయి. ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలని భావించే వారికి కూర్గ్ ఒక అద్భుతమైన గమ్యస్థానంగా చెప్పవచ్చు.
జూన్ నెలలో చల్లని వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వారు లడఖ్, డార్జిలింగ్, ఊటీ, మున్నార్, కూర్గ్ వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే మరపురాని ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ప్రకృతి అందాలు, మేఘాల మధ్య విహారం, పర్వత ప్రాంతాల ప్రశాంతత, వర్షాకాలపు ఆహ్లాదకర వాతావరణం ఈ ప్రాంతాలను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
ALSO READ: హైడ్రా పై విమర్శలకు చెక్!