Crime Mirror, Health Tips: మన వంటగదిలో నూనె లేకుండా ఏ వంటా పూర్తికాదు. మార్కెట్ నుంచి తెచ్చిన నూనెను చాలారోజుల పాటు నిల్వ ఉంచి వాడటం చాలా ఇళ్లలో కామన్. కానీ ప్యాక్ చేసిన ఆహార పదార్థాల మాదిరిగానే వంట నూనెకు కూడా గడువు ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. గడువు ముగిసిన లేదా పాడైపోయిన నూనెను వాడితే ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా నూనె ప్యాక్ సీల్ చేసి ఉన్నంత వరకు దానిపై ఉన్న “బెస్ట్ బిఫోర్” తేదీ వరకు బాగానే ఉంటుంది. చాలా రకాల వంట నూనెలు ఒకటి నుంచి రెండు సంవత్సరాల వరకు నిల్వ ఉంటాయి. అయితే ఒకసారి సీల్ ఓపెన్ చేసిన తర్వాత గాలితో కలవడం మొదలవుతుంది.
దీనివల్ల ఆక్సిడేషన్ జరిగి నూనె నాణ్యత క్రమంగా తగ్గుతుంది. అందుకే ఓపెన్ చేసిన నూనెను 6 నుంచి 8 నెలల లోపు వాడేయడం మంచిదని సూచిస్తున్నారు. ఆవనూనె వంటి కొన్ని రకాల నూనెలు మాత్రం కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
నూనె పాడైందో లేదో కొన్ని లక్షణాల ద్వారా సులభంగా గుర్తించొచ్చు. మొదటిగా వాసనలో మార్పు కనిపిస్తుంది. నూనె నుంచి వింతగా, పాత నిల్వ వాసన లేదా రసాయనాల్లాంటి దుర్వాసన వస్తే జాగ్రత్తపడాలి. రుచిలో కూడా తేడా ఉంటుంది. వంట చేసినప్పుడు చేదుగా లేదా అసహజమైన టేస్ట్ వస్తే అది మంచిది కాదు.
రంగులో మార్పు కూడా ఒక సంకేతం. కొత్తగా ఉన్నప్పుడు స్పష్టంగా కనిపించే నూనె.. పాడైతే మసకబారినట్టు లేదా ముదురు రంగులో కనిపించొచ్చు. కొన్నిసార్లు అడుగున మలినాలు లేదా చిక్కగా మారినట్టు కూడా కనిపిస్తుంది. అలాంటి నూనె వాడకపోవడమే మంచిది.
పాడైపోయిన నూనెను తరచూ వాడటం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఇబ్బందులు రావచ్చు. అందుకే నూనెను ఎప్పుడూ చల్లని ప్రదేశంలో, నేరుగా ఎండ పడకుండా నిల్వ ఉంచాలి. బాటిల్ మూతను బిగిగా పెట్టడం కూడా అవసరం.
చిన్న విషయంలా అనిపించినా.. వంట నూనె తాజాగా ఉందా లేదా అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కాబట్టి మీ ఇంట్లో ఉన్న నూనె వాసన, రంగు, రుచి ఒకసారి చెక్ చేసుకుని వాడటం మంచిది.