కర్ణాటకలో సీఎం మార్పు వార్తలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఫైనల్ కు చేరినట్లు తెలుస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ కు సీఎం బాధ్యతలు అప్పగించేందుకు అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.
త్వరలో సిద్ధరామయ్య రాజీనామా
ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆలోచించి తుది నిర్ణయం చెప్పాలని ఆయనను కోరినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య త్వరలోనే రాజీనామా చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సుమారు 6 గంటల పాటు చర్చ
ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో అధికారికంగా రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చర్చించినట్లు కాంగ్రెస్ తెలిపినా, అసలు ప్రధాన అంశం కర్ణాటక నాయకత్వ మార్పేనని సమాచారం. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలాతో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పాల్గొన్నారు. దాదాపు ఆరు గంటల పాటు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత సీఎం పదవిపై అప్పట్లోనే చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ రెండున్నరేళ్లు చొప్పున పదవిని పంచుకుంటారని డీకే వర్గం అప్పటి నుంచే చెబుతోంది. అయితే అలాంటి ఒప్పందం ఏదీ లేదని సిద్ధరామయ్య పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తానని కూడా చెబుతూ వచ్చారు.
ప్రభుత్వానికి మూడు సంవత్సరాలు పూర్తి
ఇటీవల సిద్ధరామయ్య ప్రభుత్వం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో మరోసారి నాయకత్వ మార్పుపై చర్చ మొదలైంది. ఇప్పుడు అధిష్టానం ఇద్దరు నేతలను ఢిల్లీకి పిలిచి చర్చలు జరపడంతో, త్వరలోనే కర్ణాటకలో రాజకీయ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.