Homeరాజకీయంప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ వ్యాఖ్యలు వెనక్కి.. కారణం అదేనా.!

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ వ్యాఖ్యలు వెనక్కి.. కారణం అదేనా.!

క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్:- మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఆ పార్టీకి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఉద్ధేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసిన ఈ ఇద్దరు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాలని కోరగా.. జగన్‌తో శత్రుత్వం పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న విషయాన్ని గుర్తెరగాలని ఈ ఇద్దరి నేతలకు అమిత్‌ షా హితవు పలికనట్టు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కూటమి పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. వైసీపీ ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఇదీ జగన్‌ సత్తా అంటూ సంబరపడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో అటు జనసేన, కూటమి పార్టీలు నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటనను ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండు రోజులు నుంచి రాష్ట్రంలోని అనేక చోట్ల ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌పై జనసేన శ్రేణులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నాయి. జనసేనపై ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కావాలనే ఈ తరహా ఆరోపణలు చేశారంటూ విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్‌ కూడా ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ వ్యాఖ్యలు పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. వెనక్కి తీసుకోవాలని కోరారు.

వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటన..

రాష్ట్రంలో సంచలనంగా మారిన తన వ్యాఖ్యలను ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఒక ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు బేషరతుగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. దీనికి ముందు కూడా ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ గతంలో పవన్‌ కల్యాణ్‌ కేంద్ర పెద్దలతో జగన్‌ను ఆటాడిస్తానని చెప్పిన మాటలు వాస్తవం కాదా.? అన్నట్టుగా కూడా ప్రశ్నించారు. ఏది ఏమైనప్పటికీ తనకు వచ్చిన సమాచారం తప్పే అయితే వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. గతంలో తన కుమారుడి వివాహానికి పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించిన వెంటనే ఆయన వచ్చారని, ఆయనంటే తనకు గౌరవం ఉందని కూడా ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ పేర్కొన్నారు. విశ్వసనీయ వ్యక్తులు నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే తాను వ్యాఖ్యలు చేసినట్టు గతంలో చెప్పిన ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి బలమైన కారణమే ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా పరిగణించినట్టు ఆయనకు తెలిసింది. ఇప్పటికే జనసేన పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్న సన్నిహితుల సూచనలతోనే ఆయన వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు ఇప్పటికే చేయాల్సిన నష్టాన్ని చేశాయని, ఇప్పడు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ చేసిన ప్రకటన వల్ల ప్రయోజనం ఉండదని పలువురు పేర్కొంటున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు