క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు ఏర్పాటు చేయాలని ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారులకు సమాచారం అందింది. కొత్తగా రాష్ట్రంలో 15 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పెన్షన్లు మంజూరు చేయడం ద్వారా రాష్ట్రంలో మరో ఎన్నికల హామీ నెరవేర్చినట్లు అవుతుందని కూటమి పార్టీ నాయకులు చెబుతున్నారు. 60 ఏళ్ళు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయడంతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే హామీని గడిచిన ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చారు.. కొత్త పెన్షన్ల మంజూరు సమయంలోనే ఈ హామీను కూడా నెరవేర్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని, ఈ మేరకు ఆయా కులాలకు చెందిన 50 ఏళ్లు దాటిన వారికి కూడా పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
15 లక్షల మందికిపైగా అర్హులు ఉంటారని అంచనా..
కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తే సుమారు 15 లక్షల మంది వరకు అర్హులు ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 62.47 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నారు. వీరికి 28 రకాల పెన్షన్లు ప్రభుత్వం అందిస్తోంది. కొత్తగా 15 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తే ఈ సంఖ్య 77 లక్షలకు చేరుకుంటుంది. పెరగనున్న పెన్షన్ లబ్ధిదారుల వల్ల పెన్షన్ల కోసం వెచ్చించే మొత్తం కూడా భారీగా పెరగనుంది. ఈ పెన్షన్ల కోసం ప్రతినెల రూ.2,720 కోట్ల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై పడుతుంది. కొత్తగా మంజూరు చేయనున్న పెన్షన్ల వల్ల ప్రభుత్వంపై ప్రతినెల ఆధారంగా రూ.700 కోట్ల వరకు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీంతో మొత్తం పెన్షన్లకు వెచ్చించే వ్యయంపై ఏటా అదనంగా రూ.8400 పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పంపిణీకి ఏర్పాట్లు..
ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొన్ని కీలక ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు ఇచ్చిన పెన్షన్లు హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టి, బీసీ కులాలకు చెందిన వారికి 50 ఏళ్లు దాటితే పెన్షన్లు పంపిణీ చేస్తామని గతంలో కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఫలితం ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ హామీని అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వీలైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.