Homeఆంధ్ర ప్రదేశ్Heatwave Alert: 25 వరకు మండే ఎండలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక!

Heatwave Alert: 25 వరకు మండే ఎండలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్ లో ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా రోహిణి కార్తె ప్రారంభానికి ముందు నుంచే వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రారంభం కానుండగా, అప్పటివరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖతో పాటు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

కోస్తా ఆంధ్ర, రాయలసీమలో మండుతున్న ఎండలు   

కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉదయం నుంచే భగ్గుమనే ఎండలు కనిపించాయి. ఉక్కపోత కూడా ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీచాయి. నెల్లూరు జిల్లాలోని కొమ్మిపాడులో అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈ నెల 25 వరకు తీవ్రమైన ఎండలు

ఇవాళ (మంగళవారం) పరిస్థితి మరింత కఠినంగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు చేరే అవకాశముందని అంచనా వేసింది. రేపు (బుధవారం) కూడా శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు అనేక ప్రాంతాల్లో వేడిగాలులు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని హెచ్చరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు  

ఇదిలా ఉండగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాతావరణంలో మార్పులు కనిపించాయి. సోమవారం రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడింది.  మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా క్రమంగా విస్తరిస్తున్నాయి. సోమవారం అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ దీవుల వరకు రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాబోయే రోజుల్లో వర్షాల పరిస్థితిపై కూడా ఆశలు పెరుగుతున్నాయి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు