HomeజాతీయంBullet Train First Look: భారత తొలి బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ రివీల్.. ఆరెంజ్...

Bullet Train First Look: భారత తొలి బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ రివీల్.. ఆరెంజ్ కలర్ లో భలే ఉంది!

భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ ఎట్టకేలకు రివీల్ అయ్యింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి ఫోటోను రైల్వే శాఖ విడుదల చేసింది. న్యూఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖ గేట్ నంబర్–4 వద్ద ఈ బుల్లెట్ ట్రైన్ నమూనాను ప్రదర్శించారు. తెలుపు, ఆరెంజ్ రంగుల్లో ఆకర్షణీయంగా డిజైన్ చేసిన ఈ ట్రైన్ చూడగానే ఆధునిక హైస్పీడ్ రైలు రూపాన్ని చూపిస్తోంది.

508 కిలోమీటర్ల దూరం కవర్!

ఈ బుల్లెట్ ట్రైన్ ముంబై–అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుంది. జపాన్ సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు వల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. సాధారణంగా గంటల సమయం పట్టే ఈ ప్రయాణం సుమారు 2 గంటలకు తగ్గుతుందని అధికారులు తెలిపారు.

2 గంటల్లో ముంబై- అహ్మదాబాద్ ప్రయాణం

ఈ మార్గం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి ప్రారంభమై థానే, విరార్, బోయిసర్, వాపి, సూరత్, బరూచ్, వడోదర, ఆనంద్ వంటి ముఖ్య నగరాల మీదుగా అహ్మదాబాద్‌లోని సబర్మతికి చేరుతుంది. పరిమిత స్టాప్‌లతో నడిచే ప్రత్యేక సర్వీస్ ద్వారా సూరత్, వడోదర, అహ్మదాబాద్ మధ్య ప్రయాణం కేవలం 2 గంటల 7 నిమిషాల్లో పూర్తవుతుందని రైల్వే శాఖ తెలిపింది.

సూపర్ స్పీడ్ తో కొనసాగుతున్న పనులు

ప్రాజెక్ట్ పనుల విషయంలో భూసేకరణతో పాటు అవసరమైన చట్టపరమైన అనుమతులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కారిడార్ అంతటా నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సూరత్, వడోదర, అహ్మదాబాద్, సబర్మతి వంటి కీలక ప్రాంతాల్లోని స్టేషన్ల శంకుస్థాపన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని ధానే, విరార్, బోయిసర్ ప్రాంతాల్లో నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ముంబై బీకేసీ దగ్గర అండర్‌గ్రౌండ్ స్టేషన్ తవ్వకాల పనులు దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 17 రివర్ బ్రిడ్జ్‌ ల నిర్మాణం పూర్తయింది. నర్మదా, మహి, తపతి, సబర్మతి నదులపై కీలక బ్రిడ్జ్‌లు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి.

అలాగే, అత్యంత సవాలుగా భావిస్తున్న 21 కిలోమీటర్ల అండర్ సీ టన్నెల్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఘన్సోలి–శిల్ఫాట మధ్య 4.8 కిలోమీటర్ల టన్నెల్ ఇప్పటికే పూర్తయింది. మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ.1.08 లక్షల కోట్లుగా ఉంది. 2027 ఎండింగ్ నాటికి ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ ను పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు