రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ తన విధానాన్ని మార్చబోదని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ స్పష్టం చేశారు. అమెరికా విధించిన ఆంక్షలకు సంబంధించి ఇచ్చిన వెసులుబాటు గడువు మే 16తో ముగిసినా, రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగుతాయని ఆమె తెలిపారు.
ఆంక్షలు సడలించిన అమెరికా
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. అందులో భాగంగా రష్యా చమురు కొనుగోళ్లపైనా పరిమితులు పెట్టాయి. అయితే, ఇటీవల ఇరాన్ పై జరిగిన దాడులు, మధ్యప్రాచ్యంలో పెరిగిన ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ మార్కెట్‌లో చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. దీంతో అంతర్జాతీయంగా ఇంధన కొరత రాకుండా ఉండేందుకు అమెరికా కొన్ని సడలింపులు ఇచ్చింది. ఏప్రిల్ 17కు ముందు నౌకల్లో లోడ్ చేసిన రష్యా ముడి చమురును ఇతర దేశాలు కొనుగోలు చేయవచ్చని, వాటిపై ఆంక్షలు వర్తించవని అమెరికా ప్రకటించింది. ఈ వెసులుబాటు మే 16 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ గడువు ముగిసిన తర్వాత భారత్ ఏం చేస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆగవు!
ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన సుజాత శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రష్యాపై ఆంక్షలు ఉన్న సమయంలో కూడా భారత్ అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసింది. ఆంక్షలు సడలించిన తర్వాత కూడా కొనుగోళ్లు కొనసాగించాం. ఇక ముందు కూడా రష్యా చమురును కొనుగోలు చేస్తూనే ఉంటాం’’ అని ఆమె స్పష్టం చేశారు. భారత్‌కు చమురు అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయని, అందుకే తక్కువ ధరకు లభించే అవకాశాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు అందడం వల్ల భారత్‌కు పెద్ద ఎత్తున లాభం కలుగుతోందని భావిస్తున్నారు.
మినహాయింపులను పొడిగించిన అమెరికా
ఇదిలా ఉండగా, అమెరికా మరోసారి ఈ మినహాయింపులను పొడిగించింది. రష్యా చమురు కొనుగోళ్లకు ఇచ్చిన ఈ వెసులుబాటును మరో 30 రోజుల పాటు కొనసాగించనున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి బెస్సెంట్ తెలిపారు.