క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్ కొత్తపేట చౌరస్తా వద్ద మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మే 12 మంగళవారం తెల్లవారుజామున ఒక డీసీఎం వాహనంలో తరలిస్తున్న 8 ఎద్దులను “పశువుల వధకై” (కసాయిఖానాకు) తరలిస్తున్నారనే అనుమానంతో కొంతమంది వ్యక్తులు అడ్డుకున్నారు. అయితే, ఆ ఎద్దులను పాతబస్తీలోని పురాణీ హవేలీలో జరగబోయే ఒక సినిమా షూటింగ్ కోసం తీసుకువెళ్తున్నట్లు చెప్పారు.
దింతో వాహనంలో ఉన్న నిర్వాహకులపై దాడి జరుగుతుండటంతో సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పశువులను సురక్షితంగా ఫతుల్లాగూడలోని గోశాలకు తరలిస్తుండగా, చైతన్యపురి యూ-టర్న్ వద్ద నిందితులు బైక్‌లపై వెెంబడించి పోలీసు వాహనాల పై రాళ్లు రువ్వారు.
ఈ రాళ్ల దాడిలో ఒక డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు పలువురు పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి, విధులకు ఆటంకం కలిగించడం, అల్లర్లకు పాల్పడటం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం కేసు నమోదు చేసి, సరూర్ నగర్ పోలీసులు తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఈ ఘటనలో పాల్గొన్న మిగిలిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, పశువుల రవాణాపై ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా పోలీసులకు సమాచారం అందించాలని, పుకార్లను నమ్మి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని మల్కాజ్‌గిరి కమిషనరేట్ హెచ్చరించింది.