HomeజాతీయంUP Cabinet Expansion: యూపీలో త్వరలో క్యాబినెట్ విస్తరణ.. ఆరుగురికి అవకాశం!

UP Cabinet Expansion: యూపీలో త్వరలో క్యాబినెట్ విస్తరణ.. ఆరుగురికి అవకాశం!

ఉత్తరప్రదేశ్‌లో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్ ను కలిశారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్తగా కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

యూపీ కేబినెట్ లో 60 మంది మంత్రులకు అవకాశం

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో మొత్తం 54 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉంటారు. రాష్ట్రంలో గరిష్టంగా 60 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో ఇంకా ఆరుగురికి స్థానం ఖాళీగా ఉంది. ప్రస్తుతం క్యాబినెట్‌లో 21 మంది పూర్తి స్థాయి మంత్రులు, 14 మంది స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు, 19 మంది సహాయ మంత్రులు కొనసాగుతున్నారు.

మొదటగా కొంతమంది ప్రస్తుత మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న వారిని కొనసాగిస్తూ, ఖాళీ స్థానాల్లో కొత్తవారిని చేర్చే దిశగా పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్తగా మంత్రివర్గంలో చేరేది ఎవరంటే?

కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశమున్న నేతల పేర్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కృష్ణ పాశ్వాన్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యే పూజా పాల్, మనోజ్ పాండే, భూపేంద్ర చౌదరి, అశోక్ కటారియా, రోమి సహాని పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరికి మంత్రివర్గంలో బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీకి దగ్గర వర్గాలు చెబుతున్నాయి.

యోగి ఆదిత్యనాథ్ 2022లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2024 మార్చిలో తొలిసారి మంత్రివర్గ విస్తరణ చేశారు. ఇక 2027 అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈసారి ప్రాంతీయ, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గంలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు