Below Normal Rainfall Expected: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 20వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశముంది. మే రెండో వారం చివరికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం కనిపించవచ్చని అధికారులు తెలిపారు. దీంతో దేశంలో వర్షాకాలం ప్రారంభానికి సంబంధించిన కదలికలు మొదలయ్యాయి.
సాధారణం కంటే తక్కువగా వర్షపాతం
అయితే ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా దీర్ఘకాల సగటు వర్షపాతంలో సుమారు 92 శాతం మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా ఖరీఫ్ సీజన్లో రైతులు వరి, పత్తి, పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి పంటలను సాగు చేస్తారు. ఈ పంటల నాట్లు వేసే సమయంలో సరైన వర్షాలు పడకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి తగ్గితే మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీని ప్రభావం ద్రవ్యోల్బణం, వినియోగంపై కూడా పడొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
నైరుతి గాలులు వీచే అవకాశం
ఇక ఈ వారం బంగాళాఖాతం నుంచి ఈశాన్య భారతదేశం వరకు దిగువ, మధ్యస్థాయి వాతావరణ పొరల్లో నైరుతి గాలులు వీచే అవకాశముందని ఐఎండీ తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు మరియు ఈశాన్య భారత ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో దాదాపు సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల పురోగతి, వర్షాలు పడే సమయం రైతులకు చాలా కీలకంగా మారనుంది. దీంతో రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు వాతావరణ పరిస్థితులను ఆసక్తిగా గమనిస్తున్నారు.