Homeజాతీయంవిజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. ఇక ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనా..?

విజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. ఇక ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనా..?

తమిళనాడు రాజకీయ యవనికపై ఉత్కంఠభరితమైన హైడ్రామా చోటుచేసుకుంటోంది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు అనూహ్యమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. తొలుత టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) తాజాగా తమ మద్దతును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. ఈ పరిణామంతో మ్యాజిక్ ఫిగర్ సాధించే క్రమంలో విజయ్ లెక్కలు తలకిందులయ్యాయి. ఒకవైపు మిత్రపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉండగానే మరోవైపు ఐయూఎంఎల్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

మరో కీలక మిత్రపక్షమైన వీసీకే (VCK) నుంచి కూడా స్పష్టమైన సంకేతాలు అందడం లేదు. విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని వీసీకే నేతలు బహిరంగంగా ప్రకటించినప్పటికీ.. దానికి సంబంధించిన అధికారిక లేఖ ఇప్పటి వరకు గవర్నర్‌కు అందలేదు. ఈ సాంకేతిక కారణాల వల్ల టీవీకే బలం ప్రస్తుతం 116 స్థానాలకే పరిమితమైంది. తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కాగా.. విజయ్ శిబిరం దానికి రెండు సీట్ల దూరంలో నిలిచిపోయింది. సంఖ్యాబలంపై స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో రాజ్‌భవన్ నుంచి అధికారిక ఆహ్వానం అందడంలో జాప్యం జరుగుతోంది.

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో గవర్నర్ రాజేంద్ర ఇప్పటి వరకు విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అధికారికంగా ఆహ్వానించలేదు. కేవలం నోటి మాట మద్దతు కాకుండా ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను గవర్నర్ ఆశిస్తున్నారు. వీసీకే లేఖ అందకపోవడం.. ఐయూఎంఎల్ తప్పుకోవడం వంటి కారణాలతో విజయ్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ తన వ్యూహాన్ని మార్చి ఇతర స్వతంత్రులు లేదా చిన్న పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.

తమిళనాట గంట గంటకు మారుతున్న ఈ రాజకీయ సమీకరణాలు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మెజారిటీ మార్కును చేరుకోవడానికి అవసరమైన ఆ రెండు సీట్ల కోసం టీవీకే నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు అన్నాడీఎంకే.. ఇటు డీఎంకే వర్గాలు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ప్రస్తుతానికి విజయ్ ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధం నెలకొన్నప్పటికీ.. రాబోయే కొన్ని గంటల్లో వీసీకే నుంచి మద్దతు లేఖ అందే అవకాశం ఉందని టీవీకే శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. రాజ్‌భవన్ నుంచి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ: కేంద్రం నిధులు లేకపోతే పంచాయతీలు సున్నా.. రేవంత్ సర్కార్‌పై ఈటల రాజేందర్ నిప్పులు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు