Tadmetla Naxal Attack Case: దేశంలో అత్యంత ఘోరమైన నక్సల్స్ దాడుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాడ్ మెట్ల ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 10 మంది నిందితులను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సరైన ఆధారాలు లేకపోవడం, పోలీసుల దర్యాప్తులో అనేక లోపాలు ఉండటంతో వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
2010లో నక్సల్స్ మెరుపుదాడి
ఈ ఘటన 2010 ఏప్రిల్ 6న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా తాడ్మెట్ల గ్రామం సమీపంలో జరిగింది. ఆ రోజు 62వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు అడవి ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో నక్సలైట్లు ఆకస్మికంగా దాడికి దిగారు. ఈ మెరుపు దాడిలో 75 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దేశాన్ని కలిచివేసిన ఈ ఘటన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి 10 మందిని అరెస్టు చేశారు. వీరిపై నక్సల్స్‌కు సహకరించినట్లు ఆరోపణలు మోపారు. అయితే, కేసు విచారణ సమయంలో సరైన సాక్ష్యాలను సమర్పించలేకపోయారని ట్రయల్ కోర్టు గుర్తించింది. దర్యాప్తు విధానంలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ 2013 జనవరి 7న ఆ 10 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
సంచనల తీర్పు వెల్లడించిన హైకోర్టు
ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ రమేశ్ సిన్హా, జస్టిస్ రవీంద్రకుమార్ అగ్రవాల్‌తో కూడిన ధర్మాసనం ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించింది. 75 మంది జవాన్లు మరణించడం చాలా విషాదకరమని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే, భావోద్వేగాల ఆధారంగా తీర్పు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసులో నిందితులపై స్పష్టమైన ఆధారాలు లేవని, కేవలం అనుమానాల ఆధారంగా శిక్ష విధించడం చట్టపరంగా సరైంది కాదని పేర్కొంది. దీంతో ఈ కేసులో ఉన్న 10 మంది నిందితులు విడుదల అయ్యారు.