సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యంత్రాంగం అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు.
కరోనా వైరస్ గతంలో మనుషుల ప్రాణాలు తీస్తే ఇప్పుడు కాంగ్రెస్ పాలన రైతుల ఉసురు తీస్తోందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తీరు ‘బాత్ కరోడో మే.. కామ్ పకోడో మే’ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ సహా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అలాగే మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కడమే కాకుండా గతంలో కేసీఆర్ అందించిన పథకాలను సైతం రేవంత్ రెడ్డి నిలిపివేశారని విమర్శించారు. ఎస్సీ అలాగే ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లుతున్నాయని ఈ రెండున్నరేళ్లలో ఒక్క రూపాయి లబ్ధి కూడా జరగలేదని దుయ్యబట్టారు.
వ్యవసాయ రంగం వినాశనం
గతంలో మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడకు ఏనాడైనా గోదావరి జలాలు తీసుకువచ్చారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఎస్సారెస్పీ ఫేజ్-2 పూర్తి చేసి ఈ ప్రాంత పొలాలకు సాగునీరు అందించామని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలో కూలీల కొరత ఉన్నా బీహార్ నుంచి ప్రత్యేక రైళ్లలో హమాలీలను రప్పించి రైతుల ధాన్యాన్ని సేకరించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. గతంలో 93 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్న చరిత్ర తమదని పేర్కొన్నారు. ఈ ఏడాది 90 లక్షల టన్నులు కొంటామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ఇప్పటివరకు కనీసం 17 లక్షల టన్నులు కూడా కొనలేదని ఎండగట్టారు. యూరియా అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ రైతులను గోస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు
కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఓడిపోయినా నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారని హరీశ్ రావు ప్రశంసించారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రం కేవలం ఆన్‌లైన్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. రైతులు కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి అస్తమానం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. ఏసీ గదులు వదిలి కల్లాల వద్దకు రావాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్త రాజేష్ మృతిపై విచారం వ్యక్తం చేస్తూ ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వమే అన్యాయంగా పొట్టనబెట్టుకుందని ఆరోపించారు.
తిరుగుబాటు తప్పదు
రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే తెలంగాణలో బెంగాల్ అలాగే కేరళ తరహా రాజకీయ మార్పు వస్తుందని జోస్యం చెప్పారు. అధికార గర్వంతో అమాయక కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరి తాట తీస్తామని అలాగే వడ్డీతో సహా లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చిందని ‘కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలె’ అనే నినాదం ఊరూరా వినిపిస్తోందని చెప్పారు. కార్యకర్తలందరూ ఐక్యంగా ఉండి పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ALSO READ: Nominated positions: నామినేటెడ్ పదవుల జాతర….! కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వారికి పెద్దపీట …