ఒడిశా, క్రైమ్ మిర్రర్ : సంకల్పం ఉంటే ఎలాంటి అడ్డంకులైనా అధిగమించవచ్చని మరోసారి నిరూపించింది ఒడిశాకు చెందిన ఓ బాలిక. పుట్టుకతోనే చేతులు లేకపోయినా, కాళ్లు సరిగా లేకున్నా పట్టు వదలని విక్రమార్కుడిలా చదువు కోసం పోరాడింది. చేతులు లేకపోతేనేం కాళ్లతో రాయడం నేర్చుకుంది. ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించినప్పటికీ వాటిని పక్కనపెట్టి, ఇతర విద్యార్థుల్లానే పరీక్ష హాల్లో కూర్చొని తన ప్రతిభను చాటేది. ఆ పట్టుదలతోనే 10వ తరగతి పరీక్షలో అద్భుతమైన ఫలితాలు సాధించింది. అలా తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. ఆమెనే ఒడిశాకు చెందిన లక్ష్మీ ఖేముడు.
చిన్ననాటి నుంచే చేతులు లేవు…
మల్కన్‌గిరి జిల్లాలోని ఢేపగుఢా గ్రామానికి చెందిన నారాయణ ఖేముడు రోజూవారి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అతడి పెద్ద కుమార్తె లక్ష్మీ ఖేముడు. పుట్టుకతోనే శారీరక దివ్యాంగురాలు. లక్ష్మీకి చేతులు, కాళ్లు సరిగా పనిచేయవు. సొంతంగా నిలబడే శక్తి కూడా ఆమెకు లేదు. అందుకే ఆమె వీల్‌చైరే ఆధారంగా జీవిస్తోంది. అయితే ఆమెకు బాగా చదువుకోవాలనే కోరిక మాత్రం ఉంది. లక్ష్మీ కోరికను ఆమె కుటుంబం అర్థం చేసుకుంది. తమకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లక్ష్మీని చదివించడానికి ఏ మాత్రం తల్లిదండ్రులు వెనుకాడలేదు. లక్ష్మీ తండ్రి ఐదో తరగతి వరకు చదివారు. ఆమె తల్లి సుభద్ర నిరక్షరాస్యురాలు. అయినప్పటికీ ఆ దంపతులు తమ కుమార్తెకు ఉన్న చదువుకోవాలనే కోరిక నేరవేర్చేందుకు సిద్ధమయ్యారు. అలా లక్ష్మీ సింధిమాల ఉన్నత పాఠశాలలో తన విద్యను
అభ్యసిస్తోంది.
కాళ్లతో రాస్తూ పరీక్షల్లో ప్రతిభ…
లక్ష్మీ చేతులు లేకపోయినా కాళ్లతో రాయడం సాధన చేసింది. అలా పదో తరగతి వరకు అందరి విద్యార్థులాగానే పరీక్షలు రాస్తూ, మంచి మార్కులు సాధించేది. ఇటీవల జరిగిన పది పరీక్షలకు కూడా హాజరైంది. అయితే జిల్లా పరిపాలన దివ్యాంగుల కోసం ఇచ్చే ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. కానీ లక్ష్మీ వాటిని వినియోగించుకోకుండా, అందరు విద్యార్థులతో పాటు కూర్చిని తన పరీక్షలను పూర్తి చేసింది. అలా కాళ్లతోనే కలాన్ని పట్టుకుని పరీక్షలుV రాసింది. అంతే కాకుండా 240 మార్కులను సాధించి, అందరి ప్రశంసలు అందుకుంది.