-
అన్నంత పనిచేసిన కేసీఆర్ తనయ
-
తెలంగాణ రాష్ట్ర సేన ఏర్పాటు
-
టిఆర్ఎస్ పునరుద్ధరణ
-
తేలిగ్గా తీసుకొని.. షాక్ తిన్న గులాబీ పార్టీ అగ్ర నేతలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కల్వకుంట్ల కవిత.. తెలంగాణ పాలిటిక్స్ లో సరికొత్త సంచలనంగా మారారు. అన్నంత పని చేసి చూపించారు. తన పార్టీ పేరును “తెలంగాణ రాష్ట్ర సేన”గా ప్రకటించారు. టిఆర్ఎస్ ను పునరుద్ధరించినంత పని చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రకటించడానికి సాంకేతిక ఇబ్బందులు రావడంతో.. తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. మేడ్చల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఆవిర్భావ సభకు రాష్ట్రవ్యాప్తంగా జన సమీకరణ చేశారు. కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ సభకు 50 వేలకు మించి ప్రజలు హాజరై ఉంటారని అంచనా. కేవలం పార్టీ మాత్రమే కాదు పార్టీ జెండాను కూడా ఆవిష్కరించి సరికొత్త రికార్డు సృష్టించారు కవిత.
పక్కా వ్యూహంతోనే..
కవిత పక్కా వ్యూహంతోనే అడుగులు వేసినట్లు స్పష్టం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించి అందరి అంచనాలను తారుమారు చేశారు. మహారాష్ట్రలో శివసేన మాదిరిగా ప్రాంతీయ అస్తిత్వం కోసం కచ్చితంగా “తెలంగాణ రాష్ట్ర సేన” పోరాడుతుందని సంకేతాలు పంపించగలరు. కేవలం రాజకీయాల కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భవించలేదని.. తెలంగాణ హక్కులను కాపాడే ఒక రక్షణ కవచంల ఆ పార్టీ పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా మారిన క్రమంలో.. తెలంగాణ గుండె చప్పుడు వినిపించే అసలైన ప్రాంతీయ పార్టీ తమదే అన్నట్టు తెలంగాణ రాష్ట్ర సేనను ప్రకటించారు కవిత. ముహూర్తం ప్రకారం ఉదయం 10 గంటలకే పార్టీ ప్రకటన, జండా ఆవిష్కరణ పూర్తి చేశారు. కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ సభ జరిగినప్పటికీ.. పరిసర ప్రాంతాలన్నీ జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా సిరిసిల్లతో పాటు గజ్వేల్, సిద్దిపేట నుంచి ఎక్కువగా కవిత మద్దతు దారులు తరలిరావడం విశేషం.
చతుర్ముఖ పోటీ తప్పదు..
తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఆవిర్భావంతో తెలంగాణలో చతుర్ముఖ పోటీ తప్పేలా లేదు. ఇప్పటికే అధికార కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితులు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన మరో ప్రధాన రాజకీయపక్షంగా అవతరించనుంది. అయితే కవిత ప్రకటనను తేలిగ్గా తీసుకుంది భారత రాష్ట్ర సమితి. టిఆర్ఎస్ పేరు ఫ్రీ అయిందని.. దానిని ఇప్పుడు ఎవరైనా వాడుకోవచ్చని గతంలో కవిత ప్రకటించారు. వెంటనే అప్రమత్తమయ్యారు కేటీఆర్. భారత రాష్ట్ర సమితిని టిఆర్ఎస్ గా మార్పు ప్రతిపాదన ఉందని చెప్పుకొచ్చారు. దీంతో జగిత్యాల సభలో టిఆర్ఎస్ పునరుద్ధరణ ప్రకటన వస్తుందని అంతా భావించారు. కానీ అటువంటి ప్రకటన ఏమి రాలేదు. ఇప్పుడు కవిత ప్రకటనతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు గులాబీ పార్టీ నేతలు. కవితను చాలా తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఆమెతో పనిచేసి చూపించారు. తెలంగాణ రాష్ట్ర సేనలను ప్రకటించి టిఆర్ఎస్ ను సొంతం చేసుకున్నారు.. అయితే ఇది గులాబీ పార్టీపై పై చేయి సాధించినట్టేనని తెలంగాణ పొలిటికల్ పండితులు చెబుతున్నారు.