-
మర్రిగూడలో గాడి తప్పిన లాఅండ్ఆర్డర్.!?
-
పోలీస్ స్టేషన్ లో న్యాయం కరువు..బాధితులపై జులుం..!
-
లాఅండ్ఆర్డర్ అస్తవ్యస్తం..వరుస దొంగతనాలు, హత్యాయత్నాలతో ప్రజలు గగ్గోలు..!
-
బాధితులకు ఫుడ్ బిల్లుల హుకుం.. పేకాట శిబిరాలే లక్ష్యంగా వసూళ్ల పర్వం..!?
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన ఖాకీ కవచం.. నేడు మర్రిగూడ మండలంలో కాసుల వేటలో పడి, కాలం వెళ్లదీస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో గత కొంతకాలంగా శాంతిభద్రతలు పూర్తిగా క్షిీణించడమే కాకుండా, పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసం సడలుతోంది. వరుస దొంగతనాలు, హత్యాయత్నాలు, అక్రమ దందాలతో మర్రిగూడ మండలం ప్రస్తుతం అట్టుడుకుతోంది. వీటన్నింటికీ స్థానిక సబ్-ఇన్ స్పెక్టర్ పనితీరు, నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానికులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.
డ్యూటీకి ‘రామ్ రామ్’.. హైదరాబాద్ కు ‘సలామ్’!
మర్రిగూడ మండల కేంద్రంలో రాత్రి గంట కొట్టిందంటే చాలు, ఎస్ఐ తన సొంత పనుల నిమిత్తం, హైదరాబాద్ బాట పడుతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.! రాత్రి సమయాల్లో స్టేషన్ లో బాధ్యత కలిగిన అధికారి లేకపోవడంతో, నేరగాళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రాజపేట తండాలో జరిగిన హత్యాయత్నం ఘటన సమయంలో, ఎస్ఐ అందుబాటులో లేకపోవడమే దాడులకు ఆస్కారం ఇచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్, అవగాహన, నిఘా వ్యవస్థ నీరుగారిపోవడంతో వాహన ప్రమాదాలు కూడా గణనీయంగా పెరిగాయి..
పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితులను ఆదరించాల్సింది పోయి, వారిపైనే జులుం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి.! ఓ మహిళా సమస్యపై ఫిర్యాదు వస్తే, సదరు వ్యక్తులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వాల్సింది పోయి, తెరవెనుక పేమెంట్ డీల్స్ నడిపినట్లు ప్రచారం జరుగుతోంది.! స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు స్థానిక హోటల్ లో, పెండింగ్ లో ఉన్న ఫుడ్ బిల్లులు కట్టి రావాలని, హుకుం జారీ చేయడం అధికారుల నైతిక స్థితికి అద్దం పడుతోంది.!
మండలంలో పేకాట స్థావరాలపై దాడులు చేయడం, కేవలం వసూళ్ల కోసమేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.! పేకాట ఆడుతూ పట్టుబడిన వ్యక్తుల మొబైల్ ఫోన్లు, బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేసి, అందులో ఉన్న సొమ్మును సైతం తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే వార్తలు పోలీసు శాఖ ప్రతిష్టను మంటగలుపుతున్నాయి. దీనికి తోడు అక్రమ ఇసుక రవాణా, మట్టి మాఫియా జోరుగా సాగుతున్నా..? మామూళ్ల మత్తులో అధికారులు కన్నెత్తి చూడటం లేదనే వాదన బలంగా విన్నపడుతుంది..!
మర్రిగూడ ఎస్ఐ అసమర్థతకు లెంకలపల్లిలో జరిగిన ఘటనే నిదర్శనమని చెప్పుకోవచ్చు..! స్థానిక పోలీస్ అధికారి లాఅండ్ఆర్డర్ ను నియంత్రించలేక చేతులెత్తేయడంతో, మరో సంఘటనలో పక్కనే ఉన్న చండూర్ ఎస్ఐ పరిస్థితిని చక్కదిద్దాల్సిన దుస్థితి ఏర్పడింది.! ఇది మర్రిగూడ పోలీసుల వైఫల్యానికి పరాకాష్టగా నిలిచింది.
కుధాభక్ష్పల్లి హత్యాయత్నం కేసులో ఎస్ఐ పాత్ర సందేహాస్పదంగా ఉందని, నిందితులకు కొమ్ముకాస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.! భీమనపల్లిలో అక్రమ కోళ్ల ఫారాల నిర్మాణాలపై, నిరసన తెలిపిన సామాన్య ప్రజలపైనే కేసులు నమోదు చేయడం, వెంకెపల్లి తండాలో బాధితుల పక్షాన నిలబడిన వారిపై కేసులు చెయ్యడం ఏంటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. మండలంలో గుడిసె దగ్ధం వంటి సున్నితమైన కేసులలో, నెలల తరబడి జాప్యం చేయడం వెనుక ఉన్న అంతర్యమేమిటనే, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే రిసార్టులు, గెస్ట్ హౌస్ లలో కాలక్షేపం చేస్తూ, బాధ్యతలను గాలికొదిలేస్తే సామాన్యుడికి దిక్కెవరు? ఫిర్యాదుదారులను మీ పనికిమాలిన కేసులు చూడటానికే నేను ఉన్నానా? అని దూషించడం ఏ రకమైన పోలీసింగ్ అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గంజాయి, పేకాట వంటి సామాజిక రుగ్మతలపై రాష్ట్ర వ్యాప్తంగా, పోలీసు శాఖ యుద్ధం ప్రకటిస్తే, మర్రిగూడలో మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయం. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, మర్రిగూడలో నెలకొన్న ఈ అస్తవ్యస్త పరిస్థితులపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మండలంలో పౌర భద్రతను పునరుద్ధరించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.