Voting on April 23: తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 23న ఈ రెండు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఓటింగ్‌పై, ఫలితాలపై పడింది.
బెంగాల్ 152 నియోజకవర్గాల్లో ఓటింగ్
పశ్చిమబెంగాల్‌లో తొలి విడత ఎన్నికలు చాలా కీలకంగా భావిస్తున్నారు. ఉత్తర, దక్షిణ బెంగాల్ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాలను కలిపి మొత్తం 152 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ విడతలో 3.60 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళా ఓటర్లు స్వల్పంగా అధికంగా ఉండటం గమనార్హం. ఎన్నికలు ప్రశాంతంగా జరగేందుకు ఎన్నికల కమిషన్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. సుమారు 2.5 లక్షల మంది పోలీసు సిబ్బంది, 2,450 కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించింది. అంతేకాకుండా 8,000 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రత్యేక బృందాలను కూడా సిద్ధం చేసింది.
అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు బీజేపీ ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలని గట్టి ప్రచారం నిర్వహించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి కీలక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రముఖ నేతలు ఎన్నికల రంగంలోకి దిగారు. ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గంలో పోటీపై ఆసక్తి నెలకొంది.
ఉత్కంఠ భరితంగా తమిళ ఎన్నికలు
ఇక తమిళనాడులో కూడా ఎన్నికల పోటీ ఉత్కంఠభరితంగా ఉంది. డీఎంకే నేత ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని కూటమి మళ్లీ అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తూ విజయం సాధించాలనే ధీమాతో ఉన్నాయి. ఇదే సమయంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 4,000కు పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ ఒకే విడతలో జరుగనుండగా, మే 4న ఫలితాలు ప్రకటించనున్నారు.