Homeక్రైమ్Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో నిదా ఖాన్‌కు షాక్.. బెయిల్ తిరస్కరణ!

Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో నిదా ఖాన్‌కు షాక్.. బెయిల్ తిరస్కరణ!

నాసిక్‌లో వెలుగుచూసిన టీసీఎస్ బీపీఓకు సంబంధించిన మత మార్పిడి, లైంగిక వేధింపుల కేసు మరింత సంచలనంగా మారుతోంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్‌కు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. నాసిక్ అదనపు జిల్లా న్యాయమూర్తి కేజే జోషి ఈ మేరకు సోమవారం నిర్ణయం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు.

ప్రెగ్నెంట్ అని చెప్పినా కూడా..

నిదా ఖాన్ తన పిటిషన్‌లో తాను గర్భవతిని కావడంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరింది. అయితే కోర్టు ఈ దశలో ఆ అభ్యర్థనను అంగీకరించలేదు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కోర్టు భావించినట్లు తెలుస్తోంది.

తాజాగా మరికొన్ని ఫిర్యాదులు

ఇక ఇదే కేసులో మరిన్ని ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. నాసిక్‌లోని టీసీఎస్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా మరో మహిళా టెకీ తనకు జరిగిన అనుభవాలను వివరించింది. ఆమె తెలిపిన ప్రకారం, కార్యాలయంలో పని చేసే సమయంలో పలువురు సహోద్యోగులు, ముఖ్యంగా తన టీమ్ లీడర్, అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించింది.  తనను మానసికంగా వేధించడమే కాకుండా, బలవంతంగా మత మార్పిడికి ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. అదేవిధంగా, తన దుస్తులను పట్టుకుని లాగడం, అనుచితంగా శరీరంపై చేతులు వేయడం వంటి ఘటనలు పదేపదే జరిగాయని ఆమె వాపోయింది. ఈ వ్యవహారంతో తాను తీవ్ర ఆందోళనకు గురయ్యానని, పని వాతావరణం అసహనంగా మారిందని తెలిపింది.

ఈ తరహా ఆరోపణలు ఒక్కటే కాకుండా, మరికొంత మంది మహిళలు కూడా ఇలాంటి అనుభవాలను వెల్లడిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ కేసు మరింత కీలకంగా మారింది. సంస్థలో మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం ఈ అంశంపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.  మొత్తానికి, నాసిక్ టీసీఎస్ కేసు రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. కోర్టు తదుపరి విచారణలో ఏమి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో, సంస్థలో పని చేసే మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం అత్యవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు