Rajasthan Refinery Blast: రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచపద్ర ప్రాంతంలో ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) రిఫైనరీ పెట్రోకెమికల్ సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ను రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి నిర్మించారు. ఇవాళ(మంగళవారం) నరేంద్ర మోదీ ఈ భారీ రిఫైనరీని ప్రారంభించాల్సి ఉండగా, ఆ వేడుకకు ముందు ఈ ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేశారు.
ప్రమాద కారణాలపై ఆరా
ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల అసలు కారణం ఏమిటి అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం, రిఫైనరీలోని సాంకేతిక లోపం కారణంగా సమస్య మొదలైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ (CDU), వ్యాక్యూమ్ డిస్టిలేషన్ యూనిట్ (VDU) సమీపంలో మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు తర్వాత వెంటనే మంటలు చెలరేగి, కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది సురక్షితంగా బయటపడగలిగారు. ఎవరూ గాయపడలేదని కూడా వారు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.
రూ. 79,459 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణం
దేశంలోనే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ తో కలిపి నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ ఇది. దీనిని నిర్మించడానికి సుమారు రూ. 79,459 కోట్ల భారీ వ్యయం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, అలాగే ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడటం కొంత నిరాశ కలిగించినప్పటికీ, పెద్ద ప్రమాదం తప్పించుకోవడం ప్రధానంగా భావిస్తున్నారు. ప్రస్తుతం నిపుణులు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, అసలు కారణాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.