రాజస్థాన్, క్రైమ్ మిర్రర్: అల్వార్ జిల్లా రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందగా 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు, ట్రక్కు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద వివరాలు…
ఉజ్జయిని నుంచి ఢిల్లీకి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తోంది. పినాన్ సమీపం ఛానల్ నంబర్-100 ఇంటర్‌చేంజ్ వంతెన వద్దకు రాగానే బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో డ్రైవర్, మహిళ, చిన్నారి ఉన్నారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మందిని అల్వార్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరిని జైపూర్‌కు, ఇంకొంత మందిని రాజ్‌గఢ్, రైనికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ముందే హెచ్చరించాం…
ఈ ప్రమాదానికి ముందే డ్రైవర్‌ను హెచ్చరించామని బాధితులు పేర్కొంటున్నారు. డ్రైవర్ పలుమార్లు నిద్రతీశాడని అది గమనించి రోడ్డు పక్కన బస్సు నిలిపివేయాలని కోరినట్లు పేర్కొన్నరు. అయినా మాట వినకుండా బస్సు నడిపి ప్రమాదానికి కారకుడయ్యాడని పేర్కొన్నారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రాజేశ్ మీనా తెలిపారు
