-
తపాలశాఖ తీరుపై పలు అనుమానాలు…
-
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన
క్రైమ్ మిర్రర్, మెదక్ ప్రతినిధి : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పరిధిలో తపాల శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు భద్రంగా చేరవేయాల్సిన కీలక పత్రాలు అటవీ ప్రాంతంలో నిర్లక్ష్యంగా పడేయడం సంచలనం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని ఓ అటవీ ప్రాంతంలో ఉన్న గుడి సమీపంలో పెద్ద మొత్తంలో ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలు, బాండ్ పేపర్లు కుప్పలు తెప్పలుగా కనిపించాయి.
వీటిని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సాధారణంగా ఈ పత్రాలు పోస్టల్ శాఖ ద్వారా సంబంధిత లబ్ధిదారులకు చేరాల్సి ఉండగా, అవి ఇలా అడవిలో పడివుండటం తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది. పత్రాలను బాధ్యతగా పంపిణీ చేయాల్సిన తపాల సిబ్బంది నిర్లక్ష్యంగా వాటిని పారబోసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తమకు రావాల్సిన ముఖ్యమైన పత్రాల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న ప్రజలు, అవే పత్రాలు ఇలా అడవిలో కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన వ్యక్తిగత సమాచారం భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు వంటి పత్రాలు వ్యక్తిగత వివరాలతో సంబంధం ఉన్నవిగా ఉండటంతో, అవి ఇలా బహిరంగ ప్రదేశాల్లో పడేయడం వల్ల దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంపై వెంటనే దర్యాప్తు చేపట్టి, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోస్టల్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
