క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: పొలిటికల్ జంక్షన్ లో ఉన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. కుటుంబ వ్యక్తిగత వ్యవహారాలతో పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారన్నది ఆయనపై ఉన్న ఫిర్యాదు. అందుకే ఆయనపై వేటు వేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆయన మాత్రం ఎప్పటికైనా వైసీపీలో చేరుతానని.. అధినేత చేరదీస్తారని నమ్మకం గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పై అభిమానం చాటుతూనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రధానంగా ధర్మాన సోదరులపై నిత్యం కామెంట్స్ చేస్తున్నారు. వారి తీరుతోనే శ్రీకాకుళం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం అంచుకు వెళ్లిపోయింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి నుంచి ఆశించిన స్థాయిలో సానుకూలత రావడం లేదు దువ్వాడ శ్రీనివాస్ కు. అందుకే ఇప్పుడు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
వైసీపీ ఆశ అదే
జగన్మోహన్ రెడ్డి మావిగన్ రాజధాని ప్రతిపాదన పై రకరకాల ప్రచారం నడుస్తోంది. ప్రజల్లో బలమైన చర్చ నడుస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కానీ అంత సీన్ లేదని కూటమి భావిస్తోంది. ఇంతలో ధర్మాన ప్రసాదరావు లాంటివారు అమరావతి లోనే చంద్రబాబు పెట్టుబడి పెడుతున్నారని.. దానికి తాము వ్యతిరేకమని చెబుతున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశంగా చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడిన ప్రాంతం అని చెబుతున్నారు. అయితే ఇదే ధర్మాన జగన్మోహన్ రెడ్డి విశాఖను పాలన రాజధానిగా చేసినప్పుడు ఊరు వాడ ప్రచారం చేశారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు మావిగన్ అంటుంటే ధర్మాన నేరుగా దానిపై వ్యాఖ్యలు చేయడం లేదు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం పైనే మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటికే రాజకీయంగా ధర్మాన ప్రసాదరావును విభేదిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ తెరపైకి వచ్చారు. దువ్వాడ ఏకంగా ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీలో నో ఆప్షన్..
ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే దువ్వాడ శ్రీనివాస్‌కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో డోర్స్ క్లోజ్ అయినట్టే. మొన్నటికి మొన్న టెక్కలి నియోజకవర్గ పరిధిలోని మూలపేట పోర్టును సందర్శించారు వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు. అయితే శాసనమండలిలో వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు దువ్వాడ. మొన్న ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డికి ఎదురయ్యేసరికి దువ్వాడను దగ్గరకు పిలిచి మాట్లాడారు జగన్. కానీ అటు తరువాత దువ్వాడ శ్రీనివాస్ కు జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు లేదట. పోర్టు సందర్శన విషయంలో కూడా కనీస సమాచారం ఇవ్వలేదట. దీంతో దాదాపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు డోర్స్ క్లోజ్ అయ్యాయని దువ్వాడ శ్రీనివాస్ గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే తాజాగా మీడియా ముందుకు వచ్చి అవసరం అనుకుంటే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కళింగాంధ్రప్రదేశ్ చరిత్రను వివరించారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో తిరస్కారం..
కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘకాలం పనిచేశారు దువ్వాడ శ్రీనివాస్. ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం ఓడిపోవడం పరిపాటిగా మారింది. మధ్యలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి వెళ్లినా ఆయనకు వర్కౌట్ కాలేదు. తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశాలు కల్పించారు. కానీ ఆయనకు మాత్రం అదృష్టం లేకుండా పోయింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే కుటుంబ వ్యక్తిగత వ్యవహార శైలితో పార్టీకి దూరమయ్యారు దువ్వాడ. అయితే ఇప్పుడు వైసీపీలో తిరిగి చేరే జాన్స్ లేకపోవడంతో ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని అందుకునేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి దువ్వాడ శ్రీనివాస్ నిర్ణయం ఎలా ఉంటుందో.
