Homeక్రైమ్మర్రిగూడలో ఆగని వరుస దొంగతనాలు...!

మర్రిగూడలో ఆగని వరుస దొంగతనాలు…!

  • మర్రిగూడలో ఆగని వరుస దొంగతనాలు…!

  • ఆందోళనలో స్థానిక ప్రజలు…!

మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): ​మర్రిగూడ మండల కేంద్రంతో పాటు శివారు గ్రామాల్లో, వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆగంతకులు బరితెగించి, ఇళ్ల తాళాలు పగలగొట్టడమే కాకుండా, ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను సైతం మాయం చేస్తున్నారు. ప్రధానంగా రాత్రి సమయాల్లోనే ఈ ముఠాలు స్వైరవిహారం చేస్తుండటంతో, స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఖానాపూర్ నుంచి బంధువుల ఇంటికి వచ్చిన ఒక వ్యక్తి వాహనం దొంగతనానికి గురికాగా, రాజపేట తండాలో శ్రీకాంత్ అనే వ్యక్తికి చెందిన బైక్ కూడా మాయమైంది.

ఇదే కాకుండా శివన్నగూడెంలో ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న తల్లిగారి ఇంటికి వెళ్లి నిద్రించిన, మేకల నవిత అనే మహిళ ఇంట్లో చొరబడిన దొంగలు, 62 వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఇదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి వాహనాన్ని కూడా అపహరించడంతో పాటు, తమను ఎక్కడ గుర్తుపడతారో అన్న భయంతో, దొంగలు గ్రామంలోని సోలార్ సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం వారి తెగింపుకు నిదర్శనంగా నిలుస్తోంది.

మండలవ్యాప్తంగా రక్షణ కవచాలుగా ఉండాల్సిన సీసీ కెమెరాలు, చాలా చోట్ల మరమ్మతులకు గురై పని చేయకపోవడంతో దొంగలకు మరింత కలిసి వస్తోంది. వీటి నిర్వహణను గాలికి వదిలేయడం వల్లే, నేరస్థులు సులభంగా తప్పించుకుంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నార్పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దూది రాజు స్పందిస్తూ.. నేరాల నియంత్రణకు పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతి గ్రామానికి గ్రామ పోలీసులను కేటాయించి నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తామని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేస్తామని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న సీసీ కెమెరాలను వెంటనే బాగు చేయించి, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం పోలీసులు తక్షణమే స్పందించి ఈ దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు