* కుమారుడి వైకుంఠ సమారాధనకు రావాలని ఆహ్వానం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: గత ఏడాది ఆపరేషన్ సింధూర్ లో చనిపోయాడు తెలుగు జవాన్ మురళి నాయక్. వీరమరణం పొంది ఏడాది సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వగ్రామంలో వైకుంఠ అన్న సమారాధన ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 14న మురళి నాయక్ సొంతూరు సత్యసాయి జిల్లా కళ్లి తండాలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఆహ్వానించారు మురళి నాయక్ తల్లిదండ్రులు. తమ కుమారుడికి మీరంటే చాలా ఇష్టమని.. దేశ సైనికుడుగా ఉంటూ వీరమరణం పొందిన మురళి నాయక్ ఆత్మ శాంతించాలంటే తమరు రావాలి అంటూ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
భక్తి భావం ఎక్కువ..
శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన మురళి నాయక్ ఒక తండాలో జన్మించాడు. మురళి నాయక్ కు చిన్ననాటి నుంచే దేశభక్తి ఎక్కువ. అందుకే సైన్యంలో చేరాడు. 2022 డిసెంబర్ 29న అగ్ని వీర్ జవాన్ గా విధుల్లో చేరాడు. 851 లైట్ రెజిమెంట్ లో విధులు నిర్వహించేవాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆర్మీ అధికారులు మురళి నాయక్ ను నాసిక్ నుంచి జమ్మూ కాశ్మీర్ కు పంపించారు. సరిహద్దు ప్రాంతంలో చొరపాటుదారులతో జరిగిన ఎదురు కాల్పుల్లో 2025 మే నెలలో మురళి నాయక్ వీరమరణం పొందాడు. చిన్నప్పటినుంచి దేశభక్తి ఎక్కువగా ఉన్న మురళి నాయక్.. రైల్వేలో ఉద్యోగం వచ్చిన చేరలేదు. చివరకు సైనికుడుగా చేరి వీరమరణం పొందాడు.
అంత్యక్రియలకు పవన్ హాజరు..
అప్పట్లో ఆపరేషన్ సింధూర్ లో వీరమరణం పొందిన మురళి నాయక్ అంత్యక్రియలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మురళి నాయక్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అందుకే పవన్ అప్పట్లో హాజరయ్యారు. మురళి నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల సాయంతో పాటు ఐదు ఎకరాల భూమిని ప్రకటించారు. మురళి నాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని కూడా మాటిచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇచ్చారు కూడా. ఈ నేపథ్యంలోనే మురళి నాయక్ కుటుంబం వైకుంఠ సమారాధన ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆహ్వానించారు మురళి నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయ్. నేరుగా కలిసేందుకు తమకు అవకాశం లేదని.. అందుకే సోషల్ మీడియా ద్వారా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
