* సొంత ప్రభుత్వం పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్
* సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే నిధులా..
* ఇలా అయితే పదవుల్లో ఉండి ఏం లాభం అంటూ ఆగ్రహం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. మంత్రివర్గంలో స్థానం ఆశించి ఆయన భంగపడిన సంగతి తెలిసింది. అందుకే వరుసగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈరోజు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్యేలపై కొనసాగుతున్న వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనులకు బిల్లుల కోసం మంత్రులను, ముఖ్యమంత్రిని అడుక్కోవాల్సిన దౌర్భాగ్యం పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చూస్తుంటే మాత్రం ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో రగిలిపోతున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని గులాబీ పార్టీ భావిస్తోంది. సరిగ్గా అటువంటి సమయంలోనే సొంత ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల ప్రస్తావన తీసుకొస్తూ సరికొత్తగా నిలదీసే ప్రయత్నం చేయడం విశేషం.
ఆ పాయింట్ తో నిలదీత
సాధారణంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రుల నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు అధికంగా ఉంటుంది. వారితో పోల్చుకుంటే సాధారణ ఎమ్మెల్యేలకు నిధులు తక్కువ చేస్తూ ఇస్తుంటారు. ఇప్పుడు ఇదే పాయింట్ను పట్టుకొని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు ప్రభుత్వంపై.. నిధులన్నీ ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలకు కేటాయిస్తే.. మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలపై తీవ్ర వివక్ష చూపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి పనులన్నీ ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల నియోజకవర్గాలకు.. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ కు కేటాయిస్తున్నారని.. అటువంటప్పుడు మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటని నిలదీసినంత పని చేశారు రాజగోపాల్ రెడ్డి. ఒక శాసనసభ సభ్యుడిగా తన ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉండదా అంటూ ప్రశ్నించారు.
ఉత్తమ్ కుమార్ పై ఆగ్రహం
మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై కూడా విరుచుకుపడ్డారు రాజగోపాల్ రెడ్డి. హుజూర్ నగర్ లో మంత్రి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్నారని.. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక లిఫ్ట్ పెడుతున్నారని.. కానీ తమ నియోజకవర్గానికి ఒక లిఫ్టు లేదని.. కాలువ లేదని.. చెరువు లేదని.. ఇలా అయితే మునుగోడు ప్రజలు ఏం కావాలని ప్రశ్నించారు. తనను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ప్రభుత్వం ఉండి కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. అటువంటప్పుడు ఈ పదవిలో ఉండి ఏం లాభం అని ప్రశ్నించారు. అయితే కేవలం మంత్రి పదవి పై ఉన్న సంకేతంతోనే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సొంత పార్టీపై సీనియర్ ఎమ్మెల్యే ఎలా తిరుగుబాటు చేసినంత పని చేశారు. చూడాలి దీనిపై ఏం జరుగుతుందో..
