HomeతెలంగాణCM Revanth: నా ఉన్నతికి కారణం కేసీఆర్.. గులాబీ బాస్ కు క్రెడిట్ ఇచ్చిన సీఎం...

CM Revanth: నా ఉన్నతికి కారణం కేసీఆర్.. గులాబీ బాస్ కు క్రెడిట్ ఇచ్చిన సీఎం రేవంత్!

* ఆయన ఉక్కు పాదంతో పుట్టుకొచ్చిన నేతను నేను

* బహుముఖ వ్యూహంతో తెలంగాణ ముఖ్యమంత్రి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: రాజకీయాల్లో సానుభూతి, సెంటిమెంట్ అనేది ప్రధాన అస్త్రాలు. ఉద్దేశపూర్వకంగా ఎవరినైనా ఇబ్బంది పెడితే ఆయనపై సానుభూతి రావడం ఖాయం. అది ఏ రంగంలోనైనా సాధ్యం. చివరికి కుటుంబంలో అణచివేతకు గురి అయినా అదే ఫార్ములా వర్తిస్తుంది. ఇక రాజకీయాల గురించి చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది అని జగన్మోహన్ రెడ్డి పై విపరీతమైన సెంటిమెంట్ వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసినందుకు ఆయనపై విపరీతమైన సానుభూతి పనిచేసింది. అంతెందుకు ఒక సాధారణ నేతగా ఉన్న రేవంత్ రెడ్డి పై వేధింపులు, కేసులే ఆ ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. అందుకే తన ఎదుగుదల క్రెడిట్ ను కెసిఆర్ కు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈరోజు శాసనసభలో కూడా దానిపైనే కీలక ప్రకటన చేశారు. కెసిఆర్ లేనిదే తాను లేనట్టు మాట్లాడారు రేవంత్ రెడ్డి. కేవలం కెసిఆర్ అణచివేత నుంచి తన నాయకత్వం పుట్టుకు వచ్చిందని గుర్తు చేశారు.

విపరీతమైన సానుభూతి..

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి టార్గెట్ అయ్యారు. గులాబీ పార్టీ హయాంలో ఏకంగా ఆయన ఇంటికి వెళ్లి గలాటా సృష్టించారు అప్పటి పోలీసులు. అలా జైల్లో పెట్టి అడుగడుగునా అణచివేయాలని కెసిఆర్ చూశారు. రేవంత్ పేరు పలికేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. కానీ కెసిఆర్ తన విషయంలో చూపించిన అణచివేతతో రేవంత్ రెడ్డిలో ఒక రెబల్ ఇమేజ్ వచ్చింది. కెసిఆర్ లాంటి బలమైన నేతను ఢీకొనే మొనగాడు రేవంత్ మాత్రమేనని తెలంగాణ ప్రజలు విశ్వసించేదాకా పరిస్థితి వచ్చింది. తన పట్ల ప్రజల్లో సానుభూతి రావడానికి కారణం కేసీఆర్ అని ఇప్పటికీ రేవంత్ ప్రకటిస్తున్నారు అంటే ఆయనలో ఉన్న పరిణితి అర్థం అవుతోంది. రేవంత్ పేరు పలికేందుకు కూడా ఇష్టపడని కేసీఆర్ లోలోపల మాత్రం అతడినే ప్రత్యర్థిగా ఎంచుకున్నారు. ఆయన ప్రత్యర్థిగా ఎంచుకున్న తరువాతనే రేవంత్ రెడ్డి విశ్వరూపం చూపించారు.

ఆయనకు మించి వ్యూహకర్తగా..

కెసిఆర్ హయాంలో ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడారు విశ్లేషకులు. ఆయనను ఒక వ్యూహకర్తగా ఆకాశానికి ఎత్తేసారు. కానీ ఈ క్రమంలోనే ఆయన ఆలోచనలు మారాయి. కెసిఆర్ బయటకు చెప్పకుండానే రేవంత్ ను ప్రత్యర్థిగా మార్చి ప్రజల ముందు ఉంచారు. ప్రజల ముందు ఒక నాయకుడిగా నిలబెట్టిన ఘనత మాత్రం కెసిఆర్ ది. ప్రస్తుతం కెసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. అయినా విడిచిపెట్టడం లేదు రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యుల గృహనిర్బంధం చేశారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు రేవంత్. అసెంబ్లీకి రాకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా కేసీఆర్ను అడ్డుకుంటున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. అసలు ఫీల్డ్ లో లేని నాయకుడి గురించి ఎప్పుడూ చర్చించాల్సిన అవసరం లేదు అని తెలంగాణ సమాజానికి తనదైన సంకేతాలు పంపారు రేవంత్ రెడ్డి.

అనుమానాలు.. సంకేతాలు

ఒకవైపు కేసీఆర్ కు క్రెడిట్ ఇస్తూనే.. ఆయన బయటకు రాకపోవడం వెనుక ఏదో అంతర్గత కుట్ర ఉన్నట్లు రేవంత్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నియంత పాలనను గుర్తు చేస్తూనే ఆయన పట్ల సానుభూతి చూపుతున్నారు. కెసిఆర్ ప్రస్తుతం రాజకీయంగా మౌనంగా ఉండవచ్చు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయనను వదలడం లేదు. కెసిఆర్ అనే పదం ఏడాది తర్వాత వినిపిస్తోందని రేవంత్ చెబుతున్నారు. కానీ నిరంతరం రేవంత్ ఆయన గురించే మాట్లాడుతున్నారు. అంటే తెరవెనుక జరుగుతున్న కుట్రలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ కెసిఆర్ అనే పదాన్ని సజీవంగా ఉంచుతున్నారన్న అనుమానాలు ఉన్నాయి. కానీ కెసిఆర్ విషయంలో బహుముఖ వ్యూహంతో రేవంత్ ఉన్నట్లు అర్థమవుతోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments