HomeతెలంగాణKomatireddy: కోమటిరెడ్డి రెడ్ బుక్.. మునుగోడు లో నయా రాజకీయం!

Komatireddy: కోమటిరెడ్డి రెడ్ బుక్.. మునుగోడు లో నయా రాజకీయం!

* కాంగ్రెస్ లో కలెక్షన్ వీరుల పేర్లు రాసుకున్న రాజగోపాల్ రెడ్డి

* తన వెంట పార్టీ మారేందుకు చాలామంది డబ్బులు డిమాండ్

* తీరా ఇచ్చాక ప్రత్యర్థులతో చేతులు కలిపి నష్టం

* అటువంటి వారికి నామినేటెడ్ పదవుల్లో నో ఛాన్స్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: రెడ్ బుక్.. ఏపీలో ప్రధానంగా వినిపించే పేరు ఇది. కానీ ఇప్పుడు తెలంగాణలో సైతం అది వినిపిస్తోంది. అలాగని రాజకీయ ప్రత్యర్థుల కోసం కాదు అది. సొంత పార్టీలో ఉంటూ.. సొంత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర డబ్బులు తీసుకుంటూ.. పనిచేయకుండా.. ఇచ్చిన డబ్బులు పంచకుండా.. ప్రత్యర్థులతో చేతులు కలిపిన వారి పేర్లు రాసుకున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అటువంటి వారికి ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా… అదేమని అడిగిన వారికి.. ఇదిగో మీరు తీసుకున్న నగదు జాబితా.. ఇదిగో మీరు ప్రత్యర్ధులతో చేసుకున్న ఒప్పందం అంటూ బయట పెట్టేసరికి షాక్ తింటున్నారు. అమ్మో రెడ్ బుక్ అంటూ భయపడిపోతున్నారు.

లక్షలు వసూలు..

మునుగోడు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గత కొన్నేళ్లుగా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అయితే ఆయన తరచూ పార్టీలు మారుతూ వచ్చారు. ఈ క్రమంలో కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు ఆయన వద్ద లక్షలకు లక్షలు వసూలు చేశారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం ఆయన వైపు ఆశగా చూస్తున్నారు. అయితే ఇదిగో మీ ట్రాక్ రికార్డ్ అంటూ ఓ బుక్ తీసుకొని చూపిస్తుండడంతో వారికి షాక్ తప్పడం లేదు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన ప్రతిసారి వారికి డబ్బులు పంపకాలు చేయక తప్పలేదు. అటువంటి వారికి ఇప్పుడు పదవులు ఇచ్చే అవకాశం లేదని రాజగోపాల్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. దీంతో వారికి ఏం చేయాలో తెలియక పాలు పోవడం లేదు.

కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ…

2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. ఆ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2016లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ అయ్యారు రాజగోపాల్ రెడ్డి. 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అక్కడకు కొద్ది రోజులకు కాంగ్రెస్ పార్టీని విభేదించి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. కానీ ఆ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు. 2023 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆ ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి ఒప్పందం ఆయన కాంగ్రెస్లో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు సమీపిస్తుంది. కానీ ఇంతవరకు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

అయితే రాజగోపాల్ రెడ్డి ఓ విషయంలో తీరని బాధతో ఉన్నారట. ఆయనకు పార్టీలో చాలామంది నేతలు డబ్బులు డిమాండ్ చేశారట. కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన క్రమంలో మునుగోడు లో ద్వితీయ శ్రేణి నాయకులు చాలామంది ఆయన వద్ద లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు. దిగువ స్థాయి నేతలకు పంచుతామని చెప్పి ఐదు లక్షల రూపాయలకు తక్కువ కాకుండా తీసుకున్నారని తెలుస్తోంది. కానీ అలా ఐదు లక్షలు తీసుకున్నవారు.. తాము మూడు లక్షలు ఉంచుకొని.. మిగతా రెండు లక్షల రూపాయలను మాత్రమే ముట్ట చెప్పారు. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు రాజగోపాల్ రెడ్డి వద్ద అందిన విధంగా దోచుకున్నారట. అయితే ఇలా డబ్బులు తీసుకున్న చాలా మంది రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి రాజగోపాల్ రెడ్డిని ఓడించారట. మునుగోడు ఉప ఎన్నికలో ఇలా ప్రత్యర్థులతో చేతులు కలిపి చాలామంది నేతలు రాజగోపాల్ రెడ్డికి ద్రోహం చేశారట.

నామినేటెడ్ పదవుల్లో నో ఛాన్స్..

ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు. ఆయన ఇష్ట ప్రకారమే ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. అయితే తాము పార్టీ కోసం కష్టపడ్డామని చాలామంది నేతలు ఆయన వద్దకు వెళుతున్నాను. తమకు పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. అప్పుడే కోమటిరెడ్డి ఒక బుక్ బయటకు తీస్తున్నారు. అందులో ఒక్కొక్కరి చరిత్ర చదివి బయట పెడుతున్నారు. ఇదిగో ఇంత తీసుకున్నారు. పార్టీ మారిన క్రమంలో తన వెంట వచ్చేందుకు ఇంత మొత్తంలో మీకు అందింది. అయినా సరే మీరు పార్టీకి న్యాయం చేయలేదు. పార్టీకి అనుకూలంగా పనిచేయలేదు. అని రాజగోపాల్ రెడ్డి చెబుతుండడంతో వారు షాక్ కు గురవుతున్నారు. అలాగని నిజంగా పనిచేసిన వారికి రాజగోపాల్ రెడ్డి నామినేటెడ్ పదవులు కేటాయిస్తున్నారు. తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఏపీ పొలిటికల్ సర్కిల్ నారా లోకేష్ రెడ్బుక్ హల్చల్ చేస్తుండగా.. తెలంగాణలో మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెడ్ బుక్ సొంత పార్టీ వారిని సెగలు పుట్టిస్తోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments