తెలంగాణలో నాన్ వెజ్ ప్రియులకు షాక్ ఇచ్చే పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు ఏప్రిల్ 1 నుంచి మూతపడే పరిస్థితి ఏర్పడింది. పాల్ట్రీ కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా చికెన్ షాపుల యజమానులు సమిష్టిగా బంద్‌కు పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా పాల్ట్రీ సంస్థలు తమకు ఇస్తున్న మార్జిన్‌ను తగ్గించడం వల్ల తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని షాపుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని పేర్కొంటూ, కంపెనీలు తమ నిర్ణయాలను మార్చేంతవరకు షాపులు మూసివేసి నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈ బంద్‌కు రాష్ట్రంలోని పలు చికెన్ షాపుల సంఘాలు మద్దతు ప్రకటించడంతో ఇది మరింత ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటికే హైదరాబాద్‌లో అనేక చికెన్ షాపుల వద్ద ఏప్రిల్ 1 నుంచి బంద్ ఉంటుందని తెలిపే పోస్టర్లు కనిపిస్తూ, వినియోగదారులకు ముందస్తు సమాచారం అందిస్తున్నారు.
పాల్ట్రీ కంపెనీలు తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని, వ్యాపారులకు నష్టం కలిగించే విధంగా మార్జిన్‌ను తగ్గించడంతో చికెన్ షాపులు నడపడం కష్టసాధ్యంగా మారిందని యజమానులు ఆరోపిస్తున్నారు. చికెన్ విక్రయాలపై వచ్చే లాభాలు తగ్గిపోవడంతో అద్దెలు, విద్యుత్ ఖర్చులు, కార్మికుల వేతనాలు భరించడం భారంగా మారిందని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తాము డిమాండ్ చేస్తున్న మార్జిన్ పెంపును వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో నిరవధికంగా బంద్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు తమ నిరసన ఆగదని, ప్రభుత్వంతో పాటు పాల్ట్రీ సంస్థలు స్పందించాలని కోరుతున్నారు.
ఇటీవల కాలంలో చికెన్ ధరలు గణనీయంగా పెరగడం కూడా ఈ సంక్షోభానికి మరో కారణంగా మారింది. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల కోళ్ల మరణాలు పెరగడం, ఉత్పత్తి తగ్గిపోవడం వంటి కారణాలతో మార్కెట్లో సరఫరా తగ్గింది. దీంతో ధరలు ఒక్కసారిగా పెరిగి కిలో చికెన్ రూ.400 వరకు చేరుకుంది. ఈ ధరల పెరుగుదలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. మార్చి 29 నాటికి హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ ధర కిలో రూ.370గా ఉండగా, అమలాపురంలో రూ.350కు లభిస్తోంది. అయినప్పటికీ బంద్ అమలైతే సరఫరాపై మళ్లీ ప్రభావం పడే అవకాశం ఉండటంతో మార్కెట్ పరిస్థితులపై అనిశ్చితి నెలకొంది.
ALSO READ: టాటూల పిచ్చితో నాలుకను కూడా నల్లగా మార్చుకున్న మహిళ!
