భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, ఇంటికి శుభశక్తిని తీసుకొచ్చే పవిత్రమైన చిహ్నంగా భావిస్తారు. ప్రతి ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి పూజించే ఈ మొక్క గాలిని శుద్ధి చేయడమే కాకుండా అనేక ఔషధ గుణాలతో ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే ఇంత ప్రాధాన్యత ఉన్న తులసి మొక్కను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ చాలా మందికి ఒకే సమస్య ఎదురవుతోంది. కొద్ది రోజుల్లోనే మొక్క వాడిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీనివల్ల ఎందుకు ఇలా జరుగుతుందో తెలియక చాలామంది ఆందోళన చెందుతుంటారు. కానీ తులసి ఎండిపోవడానికి మనం తెలియక చేసే కొన్ని చిన్న పొరపాట్లే ప్రధాన కారణమవుతాయి.
మొక్క బాగా పెరుగుతుందని భావించి చాలామంది ప్రతిరోజూ అధికంగా నీరు పోస్తుంటారు. కానీ తులసి మొక్కకు ఇది అనుకూలం కాదు. కుండీలో నీరు ఎక్కువసేపు నిల్వ ఉంటే వేర్లు కుళ్ళిపోతాయి, తద్వారా మొక్క బలహీనమై ఎండిపోవడం ప్రారంభమవుతుంది. మట్టి పూర్తిగా పొడిగా అనిపించినప్పుడు మాత్రమే నీరు పోయడం మంచిది. అలాగే తులసి ఆరోగ్యంగా పెరగాలంటే రోజుకు కనీసం 4 నుండి 6 గంటల పాటు ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం. మొక్కను ఎప్పుడూ నీడలో ఉంచితే అది బలహీనపడి ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. మరో ముఖ్యమైన కారణం కుండీ డ్రైనేజీ సమస్య. కుండీకి అడుగున రంధ్రాలు లేకపోయినా లేదా మట్టి గట్టిగా ఉన్నా నీరు బయటకు పోకుండా నిల్వ ఉంటుంది. దీనివల్ల వేర్లకు గాలి అందక మొక్క నెమ్మదిగా వాడిపోతుంది.
ఇంకా చాలామంది గమనించని విషయం ఏమిటంటే.. తులసి మొక్కను సమయానుకూలంగా కత్తిరించకపోవడం. మొక్క పెరుగుతున్న సమయంలో కొమ్మలను అప్పుడప్పుడు కత్తిరించడం అవసరం. ముఖ్యంగా మంజరి వచ్చినప్పుడు దాన్ని వెంటనే తీసివేయాలి. లేదంటే మొక్క తన శక్తినంతా గింజలు తయారు చేయడంలో ఖర్చు చేసి, కొత్త ఆకులు పెరగకుండా ఎండిపోవడానికి దారితీస్తుంది. ఈ చిన్నచిన్న జాగ్రత్తలు పాటించకపోతే తులసి మొక్క త్వరగా నశిస్తుంది.
అయితే ఇప్పటికే మీ ఇంట్లో తులసి మొక్క వాడిపోతున్నా కూడా దాన్ని మళ్లీ పచ్చగా మార్చుకోవచ్చు. ముందుగా ఎండిపోయిన కొమ్మలు, పసుపు రంగులోకి మారిన ఆకులను పూర్తిగా తొలగించాలి. తరువాత మొక్కకు అవసరమైన పోషకాలు అందేలా సేంద్రియ ఎరువులను మట్టిలో కలపాలి. ముఖ్యంగా ఆవు పేడ ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. నీరు పోయేటప్పుడు ఉదయం లేదా సాయంత్రం వేళలను మాత్రమే ఎంచుకోవాలి. కుండీలో నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ రంధ్రాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తులసి మొక్క వెచ్చని వాతావరణాన్ని ఇష్టపడుతుంది కాబట్టి అతిగా చలి గాలులు లేదా అధిక వేడి తగలకుండా కాపాడాలి. ఈ విధంగా సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఎండిపోతున్న తులసి మొక్క కూడా మళ్లీ పచ్చగా మారి ఆరోగ్యంగా పెరుగుతుంది. కొద్దిపాటి శ్రద్ధతో మీ ఇంటి ఆవరణలో తులసి ఎప్పటికీ కళకళలాడుతూ ఉండేలా చూసుకోవచ్చు.
ALSO READ: హోమ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిదేనా?
