Thursday, March 26, 2026
HomeతెలంగాణAzharuddin: ఆర్నెళ్ల ముచ్చటేనా? మంత్రి అజారుద్దీన్ భవితవ్యం ఏంటి?

Azharuddin: ఆర్నెళ్ల ముచ్చటేనా? మంత్రి అజారుద్దీన్ భవితవ్యం ఏంటి?

* ఆరు నెలల కిందట మంత్రిగా బాధ్యతలు

* ఏ చట్టసభల్లోనూ సభ్యత్వం లేని వైనం

* ఈనెల 30 తో ముగుస్తున్న గడువు

* ఎమ్మెల్సీగా ఆమోదం తెలపని గవర్నర్

* రాజీనామా చేయక తప్పదా?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: మహమ్మద్ అజారుద్దీన్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఇండియన్ క్రికెట్ కెప్టెన్ గా రాణించిన ఈ క్రీడాకారుడు పొలిటికల్ గాను ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రవేశించారు. అయితే ఆయనకు అనుకొని అదృష్టం వరించింది. గత ఏడాది అక్టోబర్ 31న అప్పటికప్పుడు నేరుగా క్యాబినెట్ మంత్రి అయిపోయారు. రేవంత్ సర్కార్ లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పదవీకాలం ఏప్రిల్ 30తో ముగిసిపోనుంది. తప్పకుండా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండానే ఆయన మంత్రి పదవి ఇచ్చే పట్టారు. అలా చేపట్టిన వారు చట్టసభల్లో ఆరు నెలల్లోగా సభ్యుడు కావాల్సి ఉంటుంది. కానీ ఆయన పేరును ఎమ్మెల్సీగా ప్రతిపాదన చేసినా గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు. దీంతో ఆయన మంత్రి పదవి మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలి పోనుంది. కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఆ అదృష్టం కేవలం ఆరు మాసాలకు మాత్రమే పరిమితం అయ్యింది.

జూబ్లీహిల్స్ బైపోల్ సమయంలో..

మొన్న ఆ మధ్యన బిఆర్ఎస్ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆకస్మిక మృతితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే అధికార పార్టీ పాలనకు రెఫరండంగా మారింది ఆ ఎన్నిక. దీంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుపొందేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేసింది. ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉండడంతో వారికోసం మహమ్మద్ అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు సీఎం రేవంత్. అయితే అంతవరకు ఆయన ఏ చట్టసభల్లోనూ సభ్యుడు కాదు. దీంతో ఆయనను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో కొనసాగించాలని చూశారు సీఎం రేవంత్. అయితే ఆరు నెలల్లో ఎమ్మెల్సీ గా ఎన్నిక కావడం అంత సులభం కాదని కాంగ్రెస్ పార్టీ ముందుగానే గ్రహించింది. అయినా సరే మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించింది. తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటా కింద ప్రస్తుతానికి రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ రెండు స్థానాల్లో ఇప్పటికే కోదండరాం, అజారుద్దీన్ పేర్లను మంత్రివర్గం ఆమోదించి గత ఏడాది ఆగస్టు 30న గవర్నర్కు పంపింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పాత గవర్నర్ ఈ ఫైల్ ను పెండింగ్లో పెట్టారు. ప్రస్తుతం కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్ల బాధ్యతలు చేపట్టడం.. సుప్రీంకోర్టులో ఉన్న కేసు విచారణకు రావడం ఒకేసారి జరిగింది. ఒకవేళ మంత్రి మండలి సిఫారసు చేసిన పేర్లను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో పెడితే.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది అత్యున్నత న్యాయస్థానం.

కొత్త గవర్నర్ తో కష్టమే..

కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్ ను నియమించింది. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఆయన నియామకం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనను గవర్నర్ ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఎలా? అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఒకవేళ సుప్రీంకోర్టు సూచన మేరకు హైకోర్టుకు వెళ్తే వెనువెంటనే విచారణ జరిగే అవకాశం లేదు. సమయం చూస్తే వారం రోజులు కూడా లేదు. ఇటువంటి కేసులకు మూడు నాలుగు నెలల సమయం పట్టి అవకాశం ఉంది. అదే జరిగితే రెండోసారి కూడా అజారుద్దీన్ చట్టసభల్లోకి ఎంపికయ్యే దారులన్నీ మూసుకుపోతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రి పదవికి అజారుద్దీన్ రాజీనామా చేయక తప్పదు. ఒకటి రెండు రోజుల ముందే రాజీనామా చేయించాలని కాంగ్రెస్ హాయ్ కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మే 16 తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో మరోసారి క్యాబినెట్ లోకి తీసుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ 14తో ప్రజాకవి గోరటి వెంకన్న తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. వెంకన్న స్థానంలో అజారుద్దీన్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని సూచిక ప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తో కలిసి సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అజారుద్దీన్ రాజీనామా చేయక తప్పదు అని పొలిటికల్ పండితులు అంచనా వేస్తున్నారు.

వెంటాడుతున్న పాత కేసు..

మరోవైపు మహమ్మద్ అజారుద్దీన్ కు పాత కేసు ఒకటి వెంటాడుతోంది. ఆయన 2020 నుంచి 2023 వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ సమయంలో రూ.3.8 కోట్ల మేర దుర్వినియోగం జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగం మోపింది. అప్పట్లో అజారుద్దీన్ ముందస్తు బ్రెయిన్ తీసుకున్నట్లు కూడా పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడిచింది. ముఖ్యంగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో మౌలిక వసతుల కల్పనకు గాను జరిపిన పనుల్లో 20 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్ ను తప్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తరుణంలోనే గవర్నర్ ఆయనకు ఎమ్మెల్సీగా ఆమోదిస్తారా? లేదా అనే సందిగ్ధత కొనసాగుతోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments