క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్లోని పెట్రోల్ బంకుల వద్ద మంగళవారం నుండి ప్రస్తుతం భారీగా వాహనదారులు క్యూ కడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన కొరత ఏర్పడుతుందనే వదంతుల వల్ల ప్రజలు ఒక్కసారిగా బంకులకు రావడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
కూకట్పల్లి, బంజారాహిల్స్, బేగంపేట, ఎల్బీ నగర్, నాగోల్ వంటి ప్రధాన ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్ల కొన్ని బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు వెలిశాయి. బంకుల వద్ద వాహనాలు రోడ్లపైకి రావడంతో అమీర్పేట, పంజాగుట్ట, మెహిదీపట్నం వంటి ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది.
ప్రభుత్వ వివరణ..
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమీ లేదని, తగినన్ని నిల్వలు ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అనవసరంగా భయాందోళనతో (Panic Buying) ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఏవైనా ఇబ్బందులుంటే పౌరసరఫరాల శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1967 కు ఫిర్యాదు చేయవచ్చు.
