మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. క్రమశిక్షణను పెంపొందించడం, ప్రసార నాణ్యతను మెరుగుపరచడం, ఆటగాళ్ల వృత్తిపరమైన ప్రవర్తనను కట్టుదిట్టం చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఈ మార్గదర్శకాలను రూపొందించారు. కేవలం ప్రాక్టీస్ పరిమితులకు మాత్రమే కాకుండా, ఆటగాళ్ల దుస్తుల విధానం నుంచి వారి కుటుంబ సభ్యుల ప్రయాణాల వరకు అనేక అంశాల్లో మార్పులు చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.
కొత్త నిబంధనల ప్రకారం మ్యాచ్ జరిగే రోజున స్టేడియంలో ఎటువంటి ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించడానికి అనుమతి ఉండదు. ప్రధాన మైదానంలో ప్రాక్టీస్ చేయడం లేదా ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించడం పూర్తిగా నిషేధించబడింది. ప్రాక్టీస్ రోజుల్లో ప్రతి జట్టుకు కేవలం 2 నెట్స్ మాత్రమే కేటాయిస్తారు. ఒక జట్టు తనకు ఇచ్చిన సమయానికి ముందే ప్రాక్టీస్ ముగించినా, మిగిలిన సమయాన్ని ఇతర జట్లు ఉపయోగించుకోలేవు. అలాగే ఓపెన్ నెట్స్ విధానాన్ని కూడా పూర్తిగా రద్దు చేశారు. ఈ చర్యల ద్వారా సమాన అవకాశాలు కల్పించడం, అనవసర రద్దీని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆటగాళ్ల వ్యక్తిగత జీవితం, వృత్తి బాధ్యతల మధ్య స్పష్టమైన గీత ఉండాలని భావిస్తూ కుటుంబ సభ్యుల ప్రయాణాలపై కూడా కఠిన నియమాలు అమలు చేస్తున్నారు. ప్రాక్టీస్ రోజుల్లో ఆటగాళ్లు తప్పనిసరిగా జట్టు బస్సులోనే మైదానానికి వెళ్లాలి. వారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు జట్టు బస్సులో ప్రయాణించేందుకు అనుమతి ఉండదు. వారు వేరే వాహనాల్లో స్టేడియానికి చేరుకోవచ్చు కానీ డ్రెస్సింగ్ గది లేదా మైదానంలోకి ప్రవేశం ఉండదు. వారు కేవలం హాస్పిటాలిటీ ప్రాంతంలో నుంచే ప్రాక్టీస్‌ను వీక్షించాలి.
మ్యాచ్ అనంతరం జరిగే బహుమతి ప్రదాన కార్యక్రమాల్లో కూడా కొత్త నియమాలు అమలులోకి వచ్చాయి. ఆటగాళ్లు స్లీవ్‌లెస్ జెర్సీలు, తేలికపాటి టోపీలు లేదా స్లిప్పర్లు ధరించి కార్యక్రమాలకు హాజరుకావడం ఇకపై నిషేధం. ఈ నిబంధనను మొదటిసారి అతిక్రమిస్తే హెచ్చరిక ఇస్తారు, అదే తప్పును రెండోసారి చేస్తే భారీ నగదు జరిమానా విధిస్తారు. అలాగే జెర్సీ నంబర్లలో మార్పులు చేయాలనుకుంటే కనీసం 24 గంటల ముందుగానే సమాచారం ఇవ్వడం తప్పనిసరి చేశారు.
అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి ఇచ్చే పర్పుల్ క్యాప్ విషయంలో కూడా కొత్త నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ క్యాప్‌లను పొందిన ఆటగాళ్లు మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కనీసం మొదటి 2 ఓవర్ల వరకు తప్పనిసరిగా ధరించాలి. ప్రసార సంస్థలు వీరిని స్పష్టంగా చూపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మైదానంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ ప్రకటన బోర్డులపై బంతులు తగలకుండా జాగ్రత్త వహించాలని, వాటి ముందు కూర్చోవద్దని కూడా స్పష్టం చేశారు.
ALSO READ: వీడెవడండి బాబు!.. మటన్ ఉడకలేదని పోలీస్ కేసు పెట్టాడు..
