Homeజాతీయంగుడిలో హారతి సమయంలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా?

గుడిలో హారతి సమయంలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా?

దేవాలయంలో గంటకు ఉన్న ప్రాధాన్యం అత్యంత విశిష్టమైనది. హిందూ సంప్రదాయంలో దేవుడి దర్శనం చేసుకునే ముందు గంట మోగించడం ఒక ఆచారంగా కొనసాగుతోంది. ఆలయం చిన్నదైనా, పెద్దదైనా గంట తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు. హారతి సమయంలో, నైవేద్యం సమర్పించే వేళ, ముఖ్యమైన పూజా కార్యక్రమాల సందర్భంగా గంట నాదం ఆలయ ప్రాంగణమంతా మారుమోగుతుంది. ఈ ఆచారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం ఏమిటి అనే సందేహం చాలా మందికి కలుగుతుంది.

దేవుడి సన్నిధిలో గంట మోగించడం ద్వారా ఆ శబ్ద తరంగాలు ఆ ప్రాంతంలో ఉన్న దుష్ట శక్తులను, నెగిటివ్ ప్రభావాలను దూరం చేస్తాయని విశ్వసిస్తారు. గంట నాదం వాతావరణాన్ని పవిత్రంగా మార్చి, భక్తుడి మనస్సును ఏకాగ్రతతో దేవుని వైపు మళ్లిస్తుందని అంటారు. భగవంతుడి ముందు మన కోరికలను మనసులో కోరుకుని గంట మోగిస్తే అవి దేవుని సన్నిధికి చేరుతాయని భక్తుల నమ్మకం. అలాగే ఆలయంలో గంట నాదం వినిపించడం శుభారంభానికి సంకేతంగా భావించబడుతుంది. ఇంట్లో చేసే ప్రత్యేక పూజల సమయంలో కూడా గంట మోగిస్తే ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుందని, మానసిక ప్రశాంతత పెరుగుతుందని పెద్దలు చెబుతారు.

పురాణాల ప్రకారం.. గంటలోని ప్రతి భాగానికీ ప్రత్యేక దైవ సంబంధం ఉందని విశ్వసిస్తారు. గంట నాలుక భాగంలో సరస్వతి, ముఖ భాగంలో బ్రహ్మ, కడుపు భాగంలో రుద్రుడు, కొన భాగంలో వాసుకి, పిడి భాగంలో గరుడుడు, హనుమంతుడు, నంది వంటి దైవ స్వరూపాలు స్థితిచెందినట్లుగా భావిస్తారు. అందుకే గంటను సకల దేవతల రూపంగా పరిగణించి ముందుగా మోగించడం ఆచారంగా మారింది.

హారతి సమయంలో గంట మోగించడంలో ప్రత్యేకార్థం ఉంది. హారతి ఇవ్వబడుతున్న సమయంలో ఆలయంలోని ప్రధాన దేవతతో పాటు ఇతర దేవతలను కూడా ఆహ్వానిస్తున్నామనే భావంతో గంట మోగిస్తారు. ఆ వెలుగులో దేవుని రూపాన్ని ప్రత్యక్షంగా దర్శించడం శ్రేయస్కరం అని పూజారులు సూచిస్తారు. హారతి సమయంలో కళ్లు మూసుకోకుండా స్వామిని దర్శించాలి అని చెప్పడం వెనుక ఇదే భావం దాగి ఉంది.

కంచుతో తయారు చేసిన గంటను మోగించినప్పుడు వినిపించే నాదం “ఓం” స్వరానికి సమానంగా ఉంటుందని భావిస్తారు. ఆ ధ్వని మనస్సులో ఉన్న ఆందోళనలు, చింతలను తొలగించి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతుందని నమ్మకం. గంట నాదం ద్వారా మనసు ఒక్క క్షణం నిశ్శబ్దాన్ని అనుభవించి దేవుని స్మరణలో లీనమవుతుంది. అయితే కొన్ని ఆలయాల్లో అలంకారంగా ఒకే తాడుకు అనేక గంటలను కట్టడం చూస్తాం. అవి శోభను పెంచినా, ప్రతి గంటను విడిగా మోగించినప్పుడే సంపూర్ణ నాద ప్రభావం అనుభవించగలమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.

ALSO READ: ఇల్లు, ప్లాట్ కొనేటప్పుడు టైటిల్ డీడ్‌ ఎందుకు తీసుకోవాలంటే?

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు