క్రైమ్ మిర్రర్ : జపాన్‌లో మంగళవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. దేశ దక్షిణ ప్రాంతంలోని కుమామోటో ప్రిఫెక్చర్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూమి కంపించినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం అనంతరం తీర ప్రాంతాల్లో సునామీ అలలు వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం కుమామోటోతో పాటు నాగసాకి, కగోషిమా, ఫుకుఓకా, సాగా, ఓయిటా, మియాజాకి ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక యంత్రాంగం సూచనలు చేసింది.
భూకంపం ప్రభావంతో దక్షిణ క్యుషు ప్రాంతంలో కొన్ని రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా షింకన్సెన్ హైస్పీడ్ రైళ్ల రాకపోకలను భద్రతా కారణాల దృష్ట్యా నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక అణు విద్యుత్ కేంద్రాల భద్రతపై కూడా అధికారులు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం సెందై, జెన్‌కై అణు విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి ప్రమాదం లేదని సంబంధిత సంస్థలు స్పష్టం చేశాయి.
భూకంపం సంభవించిన సమయంలో ఇళ్లు, భవనాలు బలంగా కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం వివరాలు వెంటనే వెల్లడికాలేదు. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు నమోదయ్యే దేశాల్లో జపాన్ ఒకటి. పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. అందుకే భూకంపాలు, సునామీలను ఎదుర్కొనేలా అత్యాధునిక హెచ్చరిక వ్యవస్థలను జపాన్ అభివృద్ధి చేసింది.
also read : నానో కాలేజీది నయా మోసం…! విద్యార్థుల జీవితాలతో చెలగాటం…
