క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గోకుల్ ప్లాట్స్లోని శ్రీ రెసిడెన్సి అపార్ట్మెంట్లోని నీటి సంపు (Sump) లో పడి 13 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మరణించిన బాలికను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్దిరాల తండాకు చెందిన చరణ్, రేణుక దంపతుల కుమార్తె సారా (13) గా పోలీసులు గుర్తించారు. బాలిక తల్లిదండ్రులు గత 10 సంవత్సరాలుగా మియాపూర్ పరిధిలో వాచ్మెన్గా జీవనం సాగిస్తున్నారు. వారు ఎనిమిది రోజుల క్రితమే ఈ అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా చేరారు.
రాత్రి సమయం సుమారు 7:30 గంటలకు సంపు మూత తీసి ఉండటంతో, నీటి స్థాయిని చూసేందుకు వెళ్లిన బాలిక ప్రమాదవశాత్తు అందులో పడిపోయినట్లు భావిస్తున్నారు. కుమార్తె కనిపించకపోవడంతో గాలించిన తల్లిదండ్రులు, చివరకు నీటి సంపులో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను కనుగొన్నారు. వెంటనే నిజాంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో ఆమె మృతిపై తల్లిదండ్రులు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం సమాచారంతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ మరణం ప్రమాదవశాత్తు జరిగిందా లేదా దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.