Homeఆంధ్ర ప్రదేశ్యనమల వర్సెస్ షరీఫ్...!

యనమల వర్సెస్ షరీఫ్…!

  • రాజ్యసభ పదవి కోసం సీనియర్ల మధ్య గట్టి పోటీ

  • ఎటూ తేల్చుకోలేకపోతున్న అధినేత చంద్రబాబు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు ఏపీ నుంచి. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని, సానా సతీష్ పదవి విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్త వారి ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉండడంతో ఆ నాలుగు పదవులు.. కూటమికే దక్కనున్నాయి. అయితే ఇందులో సానా సతీష్ టిడిపి సభ్యుడు. ఏడాది కిందట ఆయన ఎన్నిక కావడంతో మరోసారి కొనసాగింపు లభించనుంది. మిగతా మూడు పదవులను మూడు పార్టీలు పంచుకోనున్నాయి.
విపరీతమైన పోటీ…

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఒక్క పదవి కోసం డజను మంది పోటీపడుతున్నారు. అయితే చివరికి ఇద్దరు సీనియర్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. యనమల రామకృష్ణుడు వర్సెస్ మైనారిటీ నేత ఎంఏ షరీఫ్ అన్నట్టు ఉంది పరిస్థితి. ఒకవేళ బీసీలకు ఇవ్వాలనుకుంటే యనమల రామకృష్ణుడు పేరు ఖరారు అవుతుంది. ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలి అనుకుంటే షరీఫ్ పేరు ఖరారు చేయడం ఖాయం. అయితే ఆ ఇద్దరూ నేతలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉండగా అండగా నిలిచారు. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా పార్టీ నుంచి బయటకు వెళ్లలేదు. పార్టీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదు.

ఇద్దరిదీ మంచి నేపథ్యం…

యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. 1983 నుంచి 2004 వరకు టిడిపి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయనకు మంత్రి పదవి దక్కడం ఖాయం. 1994లో మాత్రం అసెంబ్లీ స్పీకర్గా ఎంపిక చేశారు ఎన్టీఆర్. అయితే 1995లో టిడిపి సంక్షోభంలో చంద్రబాబు వైపు నిలబడ్డారు యనమల రామకృష్ణుడు. అలా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అందుకే చంద్రబాబు యనమల రామకృష్ణుడుకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. 1999లో మంత్రి పదవి ఇచ్చారు. 2004లో పార్టీ అధికారంలోకి రాకపోయినా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పోస్ట్ ఆయనకు కల్పించారు.

2014లో ఎమ్మెల్సీగా ఉన్న యనమలను మరోసారి మంత్రిగా ఎన్నుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఆయన పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా కొనసాగింపు కూడా లభించలేదు. ఇప్పుడు రాజ్యసభ ముంగిట నిలబడ్డారు యనమల. మరోవైపు ఎంఏ షరీఫ్ సైతం తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేత. 1983 నుంచి వివిధ హోదాల్లో పని చేస్తూ వచ్చారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2019లో శాసనమండలి చైర్మన్ పదవి ఇచ్చారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలోకి తనకున్న విచక్షణ అధికారాలతో అడ్డుకున్నారు షరీఫ్. అది ఒక చారిత్రాత్మక విజయం అమరావతి రైతులకు. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది ఆయనకు. నాడు ఆయన అడ్డుకొని ఉండకపోతే అమరావతి రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేసేవారు. అందుకే ఇప్పుడు షరీఫ్ ను రాజ్యసభకు పంపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరు సీనియర్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు