Homeఆంధ్ర ప్రదేశ్తిరుమల నడకదారిలో వైరల్ ఘటన: అడవి పందిని వరాహ అవతారంగా భావించి పూజలు.. స్పందించిన అధికారులు

తిరుమల నడకదారిలో వైరల్ ఘటన: అడవి పందిని వరాహ అవతారంగా భావించి పూజలు.. స్పందించిన అధికారులు

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల భక్తి విశ్వాసాలు  కొన్నిసార్లు హద్దులు దాటి ప్రమాదానికి దారి తీస్తోంది. తాజాగా తిరుమల నడక మార్గంలో చోటుచేసుకున్న ఓ సంఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.

మెట్ల మార్గంలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులకు ఓ అడవి పంది కనిపించింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో భక్తులు భయంతో దూరంగా వెళ్లిపోతారు. కానీ అక్కడ ఉన్న ఓ యువతి మాత్రం భిన్నంగా స్పందించింది. ఆ అడవి పందిని శ్రీమహావిష్ణువు వరాహ అవతారంగా భావించిన ఆమె, దాని దగ్గరకు వెళ్లి కుంకుమ బొట్టు పెట్టి నమస్కరించింది. ఆమె ప్రవర్తనను గమనించిన ఇతర భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈ సమయంలో ఆ అడవి పంది కూడా ఎలాంటి హానికరంగా ప్రవర్తించకుండా ప్రశాంతంగా ఉండటం అక్కడున్నవారిని మరింత ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనను అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వేగంగా వైరల్ అయింది.

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు యువతి భక్తిని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని హెచ్చరిస్తున్నారు. అడవి పందులు ఆకస్మికంగా దాడి చేసే స్వభావం కలిగినవని, వాటి దగ్గరకు వెళ్లడం ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చని గుర్తుచేస్తున్నారు.

ఈ విషయంపై అటవీ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పందించారు. భక్తులు ఇలాంటి సాహసాలకు పాల్పడకూడదని, వన్యప్రాణుల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. శేషాచలం అడవులు క్రూరజంతువులకు నిలయమని, జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమని తెలిపారు.

also read: ‘ఇరుముడి’లో రవితేజ ఎమోషనల్ జర్నీ.. సినిమాపై హైప్ పెంచుతున్న డబ్బింగ్‌ వీడియో!

తాజావార్తలు