Homeఅంతర్జాతీయంమరో ఎన్ టి ఆర్ గా 'విజయ్'...!

మరో ఎన్ టి ఆర్ గా ‘విజయ్’…!

  • పార్టీ ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే విజయకేతనం

  • దశాబ్దాల రెండు బలమైన ప్రాంతీయ పార్టీలను వెనక్కి నెట్టి గెలుపు బాట

  • సామాన్యుడిగా వచ్చి.. బలమైన ప్రభావం చూపి..

  • దళపతి విజయ్ సంచలన విజయం

క్రైమ్ మిర్రర్, ఎలక్షన్ డెస్క్ : ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి అనతి కాలంలోనే అధికారంలోకి రావడం అరుదు. అటువంటి ఘనత సాధించారు నందమూరి తారక రామారావు. పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే రికార్డును సొంతం చేసుకున్నారు దళపతి విజయ్. సరిగ్గా రెండేళ్ల క్రితం అంటే 2024 ఫిబ్రవరిలో తమిళిగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు విజయ్. తనకు రాజకీయాలంటే కేవలం వృత్తి కాదు.. ప్రజలకు సేవ చేసే పవిత్రమైన పని అంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాలు నాకు హాబీ కాదు.. నా తపన అంటూ తేల్చి చెప్పారు. కానీ తమిళ రాజకీయ పార్టీలు విజయ్ ను ఒక సినిమా నటుడి గానే చూసాయి. చాలా తక్కువగా అంచనా వేసాయి. అయితే రాజకీయ పార్టీ ప్రకటించిన నాడే తన స్టార్ డంను వదులుకున్నారు విజయ్. సినిమాలకు స్వస్తి పలికి పూర్తిస్థాయిలో రాజకీయాలకే తన జీవితం అంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రతి అడుగు సంచలనం వైపు వేశారు. చివరకు తాను అనుకున్నది సాధించారు.

ఆ రెండు పార్టీలకు ధీటుగా..
తమిళనాడు రెండు బలమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి. దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకే పునాదులు ఏర్పరచుకున్నాయి. సంప్రదాయ ఓటు బ్యాంకును సొంతం చేసుకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీవీకేను ఏర్పాటు చేశారు విజయ్. ఆ రెండు పార్టీల మాదిరిగా సంస్థాగత నిర్మాణం లేదు. బలమైన క్యాడర్ అంతకన్నా లేదు. ఆర్థికంగా స్థితివంతమైన నేతలు లేరు. ఇటువంటి సమయంలో పార్టీకి కర్త,కర్మ, క్రియ అంతా విజయ్. అలాంటి కీలక సమయంలో చాలా వరకు ఎన్నికల ర్యాలీలను విజయ రద్దు చేసుకున్నారు. అతి తక్కువ ర్యాలీల్లో పాల్గొని. రెండు ద్రవిడ పార్టీలను వెనక్కి నెట్టి.. తమిళనాడు అతి పెద్ద సింగిల్ పార్టీగా అవతరించారు. అయితే ఎన్నికల ప్రచారం నుంచి విజయ్ వెనక్కి వెళ్లిపోయారంటూ ప్రత్యర్ధులు ప్రచారం చేశారు. టీవీకే పార్టీ శ్రేణులు, విజయ్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ తన ర్యాలీలతో పాటు సభలకు భారీగా జనాలు తరలిరావడాన్ని.. ఆపై కరూర్ తొక్కిసలాట ఘటనను గుర్తుచేసుకొని విజయ్ వ్యూహాత్మకంగా ఈ ర్యాలీలు రద్దు చేసుకున్నారని స్పష్టంగా అర్థం అవుతోంది.

చాలా వ్యూహాత్మకంగా..
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ముఖ్యంగా తన ప్రసంగాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. సుదీర్ఘ ప్రసంగాల జోలికి వెళ్లలేదు. జనాలకు అర్థమయ్యేలా తక్కువ స్పీచ్ తో ఆకట్టుకోవడం పై దృష్టి సారించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నేను నటుడినే కానీ.. రాజకీయాల్లో నటించడానికి రాలేదు అంటూ ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. విజయ్ పార్టీకి మరో బలం అభిమాన సంఘాలు. ఈ ఎన్నికల్లో అవి కీలక పాత్ర పోషించాయి. రాజకీయాల్లోకి రాక ముందు నుంచి విజయ్ అభిమాన సంఘాలు బలంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఈ సంఘాలే పార్టీ ప్రచార బాధ్యతను చూసుకున్నాయి. అందుకే విజయ్ లేని లోటు తెలియనివ్వలేదు.

రాజకీయాల్లోకి రాక ముందు నుంచే విజయ్ సామాజిక అంశాలపై తన గళం వినిపించారు. 2017లో నీట్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ప్రయాణం అంతా సులువుగా జరగలేదు. గత ఏడాది సెప్టెంబరులో కరూర్ లో ఆయన ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారు. ఎన్నికల ముంగిట కుటుంబ వివాదం కూడా వెలుగు చూసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఆమె విజయ్ పై సంధించిన విమర్శలు రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మార్చాయి. మరోవైపు విజయ్ నటించిన చివరి సినిమా జననాయగన్ సినిమాను కూడా సెన్సార్ బోర్డు బ్రేక్ వేసింది. అయితే ఈ వివాదాలపై విజయ్ స్పందించిన తీరు తమిళనాడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. తాను అనుకున్న సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయ్ సక్సెస్ అయ్యారు.

ఆకట్టుకున్న మేనిఫెస్టో..
అన్నింటికీ మించి విజయ్ మేనిఫెస్టో ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు దోహద పడింది. మహిళలతో పాటు యువత ఆకట్టుకునేలా ఉంది. డీజిల్ పై సబ్సిడీ, బీమా, మత్స్యకారులకు రిలీఫ్ ఫండ్ వంటివి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. యువత కోసం 25 లక్షల రూపాయల వరకు విద్య రుణాలు. మహిళలకు 2500 ఆర్థిక సాయం, ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అమ్మాయిలకు పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం వంటి హామీలు బలంగా పని చేశాయి. మరోవైపు తన సినీ చరిష్మ కూడా బలంగా పనిచేసింది. తమిళనాడులో ఎంజీఆర్, అన్నా దురై, జయలలిత మాదిరిగానే విజయ్ గెలుపుతో మరోసారి తమిళ ప్రజల సినీ అభిమానం నిజం అయింది. నిజంగా ఈ ఎన్నికల్లో డిఎంకె గెలుస్తుందని మెజారిటీ సర్వేలు అంచనా వేసాయి. ఒకే ఒక్క సర్వే మాత్రం తమిళనాడులో ఎంజీఆర్ మాదిరిగా విజయ్ సంచలన విజయం నమోదు చేయబోతున్నారని తేల్చింది. ఇప్పుడు అదే నిజం అయింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు