తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాబోయే ఈ 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితి:-ఆంధ్రప్రదేశ్లో నేడు,రేపు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలోని మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడుతున్న సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
తెలంగాణలో ఎల్లో అలర్ట్:-అటు తెలంగాణలో కూడా వర్షాల ప్రభావం కొనసాగనుంది. ఇవ్వాళ మధ్యాహ్నం 3 గంటల గంటల వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఈదురుగాలుల హెచ్చరిక:- వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన గాలుల కారణంగా చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి : సీఎం చంద్రబాబు
రైతులకు సూచనలు:- ఈ వర్షాలు వ్యవసాయానికి అనుకూలమైనప్పటికీ, పిడుగులు మరియు ఈదురుగాలుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. పొలాల్లో పనిచేసేటప్పుడు వర్షం రాగానే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.వాతావరణ శాఖ సూచనల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాల్లోని వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
