ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల 9వ తరగతి విద్యార్థిని ప్రాచి 12వ అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. రాజ్‌నగర్ రెసిడెన్సీలోని టవర్-జీలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
ఇంట్లో ఆరబెట్టిన బట్టలు తీసుకునేందుకు ప్రాచి బాల్కనీలోకి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ఆమె 12వ అంతస్తు నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రాచి క్రీడల్లోనూ ప్రతిభ చూపిన విద్యార్థినిగా గుర్తింపు పొందింది. కేవలం రెండు రోజుల క్రితమే మహారాష్ట్రలో నిర్వహించిన సీబీఎస్‌ఈ జాతీయ రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె రెండు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించింది. అంతలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ప్రాచి మృతి ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 12 మంది కార్మికులకు గాయాలు
