Sunday, March 8, 2026
Homeఅంతర్జాతీయంEpstein Files Rock Europe: యూరప్‌లో ‘ఎప్‌స్టీన్‌’ ప్రకంపనలు, బ్రిటన్‌ ప్రధాని రాజీనామా?

Epstein Files Rock Europe: యూరప్‌లో ‘ఎప్‌స్టీన్‌’ ప్రకంపనలు, బ్రిటన్‌ ప్రధాని రాజీనామా?

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ ప్రకంపనలు యూరప్‌ లో కల్లోలం సృష్టిస్తున్నాయి. బ్రిటన్‌లో సాక్షాత్తూ ప్రధాన మంత్రి పీఠమే కదులుతుండగా.. నార్వే, స్వీడన్‌, స్లొవేకియా, ఫ్రాన్స్‌ వంటి దాదాపు 10 దేశాల్లో ఈ ఫైల్స్‌ కారణంగా పలువురు మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక అమెరికాలో బ్రిటన్‌ మాజీ రాయబారి పీటర్‌ మాండెల్సన్‌కు ఎప్‌స్టీన్‌తో సంబంధాలు బట్టబయలైన నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మాండెల్సన్‌ గురించి తెలిసినా..   

మాండెల్సన్‌ గురించి తెలిసి కూడా 2024లో ఆయన్ను బ్రిటన్‌ అత్యున్నత దౌత్య పదవిలో నియమించడాన్ని రాజకీయ నాయకులు తప్పుపడుతున్నారు. మాండెల్సన్‌కు, ఎప్‌స్టీన్‌తో ఉన్న స్నేహం గురించి ఈమెయిల్స్‌ ద్వారా వెల్లడవడంతో గత సెప్టెంబరులో స్టార్మర్‌ ఆయన్ను పదవి నుంచి తప్పించారు. 15 ఏళ్ల క్రితం మాండెల్సన్‌ బ్రిటన్‌ ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఎప్‌స్టీన్‌కు చేరవేశారన్న ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ అంశంపై తీవ్ర దుమారం చెలరేగడంతో ప్రస్తుతం బ్రిటన్‌ ప్రధాని తన పదవిని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ప్రధాని స్టార్మర్ రాజీనామాకు పట్టు

అటు స్టార్మర్‌కు చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా ఉన్న మోర్గాన్‌ మెక్‌స్వీనే తన పదవికి రాజీనామా చేశారు. మాండెల్సన్‌ను నియమించాలన్న సలహా ప్రధానికి తానే ఇచ్చానని, దానికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టార్మర్‌ అధికార లేబర్‌ పార్టీ చట్టసభ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. తన పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనే లేదని స్పష్టం చేశారు. మాండెల్సన్‌ నియామకంపై విచారం వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన మోర్గాన్‌ మెక్‌స్వీనేకు వీడ్కోలు తెలిపారు. ఎనిమిదేళ్లుగా ఆయన తనకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడని చెప్పుకొచ్చారు. అయితే, ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

బ్రిటన్‌ రాజ కుటుంబం పైనా..

ఇక ఎప్‌స్టీన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన బ్రిటన్‌ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్‌ ఆండ్రూపై ఆ దేశ పోలీసులు అధికారిక రహస్యాల చట్టం కింద విచారణ ప్రారంభించారు. 2001 నుంచి 2011 దాకా బ్రిటన్‌ ప్రత్యేక వాణిజ్య ప్రతినిధిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వ రహస్య నిర్ణయాలు, తన అధికారిక పర్యటనలకు సంబంధించిన అతి రహస్య నివేదికలు, పెట్టుబడుల అవకాశాల గురించి ఎప్‌స్టీన్‌కు పంపినట్లు ఈమెయిల్స్‌ ద్వారా వెల్లడైంది. మరోవైపు నార్వేకు చెందిన రాయబారి మోనా జూల్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments