క్రైమ్ మిర్రర్ : నేపాల్‌లో వరదల కారణంగా భూగర్భ సొరంగాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో త్రిశూలీ త్రీఏ హైడ్రోపవర్ ప్రాజెక్టుకు చెందిన టన్నెల్ నుంచి ఇద్దరు వ్యక్తులను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి చెందిన 30 ఏళ్ల మెకానికల్ ఫోర్‌మ్యాన్ షా, అదే ప్రాజెక్టులో సూపర్వైజర్గా పనిచేస్తున్న 45 ఏళ్ల అమిర్ మహర్జన్ను అధికారులు రక్షించారు. వరదలతో టన్నెల్లోకి భారీగా బురద చేరడంతో వారిద్దరూ అందులో చిక్కుకుపోయారు. సుమారు తొమ్మిది రోజుల అనంతరం వారు ప్రాణాలతో బయటపడటంతో రెస్క్యూ బృందాల్లో కొత్త ఆశలు చిగురించాయి.
900 మంది గల్లంతు
వరదల ప్రభావంతో నేపాల్‌లోని 12 హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సుమారు 900 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో దాదాపు 500 మంది వివిధ టన్నెల్స్‌లో చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. త్రిశూలీ త్రీఏ ప్రాజెక్టు టన్నెల్ నుంచి ఇద్దరిని సజీవంగా వెలికితీయడం మిగిలిన వారి కుటుంబాల్లో ఆశలు నింపింది. టన్నెల్స్‌లో చిక్కుకున్న ఇతరులు కూడా ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వారి కోసం గాలింపు, సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు.
గాయాలతో బయటకు..
టన్నెల్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరి చేతులు, కాళ్లకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. చీకటి, ఇరుకైన ప్రదేశంలో ఎక్కువసేపు పాకుతూ ఉండటం వల్లే ఈ గాయాలు అయి ఉండొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నట్లు సమాచారం. అమిర్ మహర్జన్ రక్షించబడిన విషయం తెలిసిన ఆయన సోదరుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన సోదరుడు ప్రాణాలతో బయటపడటం ఎంతో సంతోషంగా ఉందని, ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని ఆయన పేర్కొన్నారు. మిగిలిన వారిని కూడా త్వరగా సురక్షితంగా బయటకు తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
also read : బహుళ అంతస్తులపై ‘ఫైర్స్…!
