తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన 45 రోజుల పసికందు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అప్పటివరకు తమతో ఉన్న చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామానికి చెందిన బొమ్మగోని కిషన్, కవిత దంపతులకు 45 రోజుల క్రితం పాప జన్మించింది. చిన్నారికి కరీంనగర్‌లోని ఆసుపత్రిలో వైద్యం చేయించి, అక్కడి నుంచి స్వగ్రామానికి బైక్‌పై తిరిగి బయలుదేరారు.
ఈ క్రమంలో రామడుగు మండలం గోపాల్‌రావుపేటలోని పెట్రోల్ బంక్ సమీపంలో కవిత ధరించిన చున్నీ బైక్ వెనుక చక్రంలో చిక్కుకుంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న తల్లీబిడ్డ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి.
వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున 45 రోజుల పసికందు మృతి చెందింది. అప్పుడే లోకాన్ని చూసిన చిన్నారి ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది.
also read: నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా వ్యాఖ్యల దుమారం.. విమర్శల మధ్య తన వైఖరికి కట్టుబాటు!
