తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈఘటన పశ్చిమ బెంగాల్ లోని కృష్ణానగర్ లో చోటు చేసుకుంది. నిరసన వ్యక్తం చేస్తూ కొందరు ఆందోళనకారులు ఆమె కార్యాలయంపై కోడిగుడ్లు, కూరగాయలు విసిరారు. ఈ ఘటన జరిగిన సమయంలో మహువా మొయిత్రా కార్యాలయంలోనే ఉన్నారు. బయట జరుగుతున్న పరిణామాలను ఆమె తన మొబైల్ ఫోన్ లో రికార్డు చేశారు.
ఆ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను దాదాపు గంటపాటు కిటికీ దగ్గర నిలబడి పరిస్థితిని గమనిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర డీజీపీతో పాటు పలువురు అధికారులకు ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఆరోపించారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకురాకుండా కేవలం చూస్తూ ఉన్నారని విమర్శించారు. “నేను ఈ నియోజకవర్గానికి ఎంపీని. నా కార్యాలయంలోనే ఉన్నాను. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఇక్కడి నుంచి వెళ్లను. బయట ఉన్నవారి ముఖాలు ఒక్కసారి చూడండి. వాళ్లు మా పార్టీకి చెందిన వారు కాదని ప్రభుత్వం చెబుతోంది. కానీ, పోలీసులు, ఇతర వ్యవస్థలు ఈ ఘటనను పట్టించుకోవడం లేదు” అని మహువా మొయిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు ఈ ఘటనకు ముందు కోల్‌కతా హైకోర్టు రాజకీయ నిరసనల్లో గుడ్లు విసిరే ఘటనలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ప్రతి సంఘటనపై తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు, ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య స్పందించారు. గుడ్లు విసరడం బీజేపీ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాంటి ఘటనలు పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.