-
ప్లాట్ల స్వాధీన ప్రక్రియలో తీవ్ర జాప్యం
-
రెండేళ్ల కిందట కాలపరిమితి పూర్తి
-
అమలు కానీ రేరా ఆదేశాలు
-
ఆందోళనలో కొనుగోలుదారులు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైదరాబాద్ బాచుపల్లి లోని ప్రతిష్టాత్మక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు.. వాసవి అర్బన్ లో సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఆశపడ్డ వందలాదిమంది మధ్యతరగతి కుటుంబాలు.. ఇప్పుడు తీవ్ర ఆర్థిక, మానసిక వేదనను అనుభవిస్తున్నాయి. 2021లో ఈ ప్రాజెక్టులో ప్లాట్లు బుక్ చేసుకున్న కొనుగోలుదారులకు, ఆరు నెలల గ్రేస్ పీరియడ్ తో కలుపుకొని డిసెంబర్ 2024 నాటికి ప్లాట్లను అప్పగిస్తామని నిర్మాణ సంస్థ ఒప్పందం చేసుకుంది. అయితే గడువు ముగిసి సుదీర్ఘకాలం గడుస్తున్నా వాసవి ఇన్ఫ్రా కాన్ ఎల్ ఎల్ పి పట్టించుకోలేదు. నిర్మాణ పనులు ఆశించిన పురోగతి లేదు. హ్యాండోవర్ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుండడంతో కొనుగోలుదారుల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తం అవుతుంది.
బ్యాంకుల నుంచి ఒత్తిడి…
దాదాపు రెండు సంవత్సరాల పాటు జాప్యం జరిగింది. ఒకవైపు సొంత ఇల్లు చేతికి చేరకపోగా.. మరోవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న గృహ రుణాలకు నెలవారి వాయిదాలు ప్రారంభం కావడంతో కొనుగోలుదారులపై మోయలేని ఆర్థిక భారం పడుతుంది. ప్రస్తుతం నివసిస్తున్న అద్దె ఇళ్లకు అద్దెలు చెల్లిస్తూనే.. ఇంకా పూర్తికాని ప్లాట్లకు లక్షలాది రూపాయల ఈఎంఐలు కట్టలేక మధ్యతరగతి ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు.. గతంలో నిర్మాణ సంస్థకు నెలకు 7000 రూపాయల చొప్పున గుడ్ విల్ సపోర్ట్ ఇస్తామని… దశలవారీగా బ్లాకులను అప్పగిస్తామని ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ హామీలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని బాధితులు వాపోతున్నారు.
రేరా ఆదేశాలు…
అయితే తమకు జరిగిన మోసంపై బాధితులు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని ఆశ్రయించారు. రేరా వారికి అనుకూలంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలుదారులు చెల్లించిన మొత్తం పై.. 2025 జూన్ 26 నుంచి చట్టబద్ధంగా ప్లాట్ అప్పగించే వరకు వార్షికంగా 10.70% వడ్డీతో నష్టపరిహారం చెల్లించాలని.. ఒప్పందంలో లేని 30 వేల రూపాయల డిబ్రిస్ చార్జీలను వసూలు చేయకూడదని ఈ ఏడాది ఆగస్టులో రేరా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా ఆదేశాలను పాటించకపోతే సెక్షన్ 63 కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
రోడ్డు ఎక్కుతున్న బాధితులు…
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి నెలలు గడుస్తోంది. కానీ బిల్డర్ నుంచి తమకు ఎంతవరకు ఎలాంటి పరిహారం అందలేదని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం బకాయిలను క్లియర్ చేసి ప్రతి నెల వడ్డీ చెల్లించాల్సి ఉన్నా.. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. రేరా తీర్పులు కేవలం కాగితాలకి పరిమితం కాకుండా.. ప్రభుత్వంతో పాటు అధికారులు బాధ్యత వహించి తమకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. వీలైనంత త్వరగా ఆ ఫ్లాట్లు స్వాధీన ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇప్పుడు బాధితుల నిత్య ఆందోళనతో బాచుపల్లి ప్రాంతం దద్దరిల్లుతోంది. ప్రభుత్వం జోక్యం కల్పించుకోవాల్సిన అవసరం ఉంది.
