-
24 ప్లాట్ ఫారాలతో అత్యాధునికంగా..
-
రోజుకు మూడు లక్షల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యంతో
-
రాజధానికి కేంద్ర రైల్వే శాఖ వరం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ రాజధాని అమరావతి విషయంలో కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకు కదలిక వచ్చింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో రాజధానిని అనుసంధానించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోర్ క్యాపిటల్ ప్రాంతంలో రైల్వే లైన్లు, ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అమరావతి రైల్వే ప్రాజెక్ట్ ఇన్నాళ్లు ప్రతిపాదనలకే పరిమితం అయింది. అయితే ఇటీవల రైల్వే శాఖతో జరిగిన సంప్రదింపులకు అమరావతి రైలు మార్గంపై తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొద్దిపాటి మార్పులతో రైల్వే మార్గాన్ని ఖరారు చేశారని చెబుతున్నారు. అందులో భాగంగా కోర్ క్యాపిటల్ ప్రాంతంలో అమరావతి రైల్వే స్టేషన్ నిర్మించాలని దాదాపు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు.
తాజా మార్పులతో…
గతంలో రాజధాని కోసం 56.53 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మించాలని భావించారు. అయితే తాజాగా చేసిన మార్పులతో 58.1 కిలోమీటర్ల మేర రైల్వే మార్గం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. తాడికొండకు ఐదు కిలోమీటర్ల దూరంలో కోర్ క్యాపిటల్ ప్రాంతంలో నిర్మించనున్న రైల్వే స్టేషన్ పై కూడా కీలక అప్డేట్ వచ్చింది. విమానాశ్రయ టెర్మినల్ తరహాలో అత్యంత ఆధునిక సదుపాయాలతో భారీ రైల్వే స్టేషన్ నిర్మించనున్నారని చెబుతున్నారు. ఇందులో సుమారు 24 ప్లాట్ఫారాలు, నాలుగు టెర్మినల్ ఉంటాయని చెప్పుకొస్తున్నారు. రోజుకు మూడు లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో ఈ మెగా రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదిస్తున్నారు. దీనికి తుది ఆమోదం లభిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక ప్లాట్ ఫారాలు ఉన్న విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లను దాటి అమరావతి ఆంధ్ర ప్రదేశ్లో అతిపెద్ద రైల్వే స్టేషన్ గా నిలవనుంది.
ప్రధాన రైల్వే నెట్వర్క్ తో…
అమరావతి రాజధాని ప్రాంతాన్ని ప్రధాన రైల్వే నెట్వర్క్ తో అనుసంధానించేందుకు ఎర్రుపాలెం – అమరావతి- నంబూరు మధ్య 57 కిలోమీటర్ల సింగిల్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ను నిర్మిస్తున్నారు. 2024 అక్టోబర్ 24న కేంద్ర క్యాబినెట్ ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ప్రారంభంలో అంచనా వ్యయం రూ.2245 కోట్లుగా పేర్కొన్నారు. ఈ 57 కిలోమీటర్ల మార్గంలో అమరావతి సహా మొత్తం తొమ్మిది కొత్త రైల్వే స్టేషనులను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ రైల్వే మార్గంలో కృష్ణా నదిపై నిర్మించబోయే భారీ వంతెన అత్యంత కీలకమైనది. గతంలో ఈ బ్రిడ్జి పొడవు 3.2 కిలోమీటర్లు గా ప్రచారంలో ఉన్నప్పటికీ.. రాజా నివేదిక ప్రకారం మాత్రం 3.38 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెనను నిర్మించనున్నారు. కేవలం ఈ వంతెనతో పాటు అప్రోచ్ పనుల కోసమే రూ.565.83 కోట్ల అంచనాలు రూపొందించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది.
ప్రధాన రైల్వే హబ్ గా…
సమీప భవిష్యత్తులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అమరావతి ఒక ప్రధాన రైల్వే హబ్ గా అభివృద్ధి చెందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు టెండర్ల దశలో ఉంది. 57 కిలోమీటర్ల మార్గాన్ని నాలుగు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుంది. 2026 అక్టోబర్ నాటికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. చివరి ప్యాకేజీ బిడ్ల దాఖలకు నవంబర్ 23 తుది గడువుగా నిర్ణయించారు. బిడ్ల పరిశీలన, ఖరారు ప్రక్రియ ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ ప్రాజెక్టుకు కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర రైల్వే శాఖ నిధుల కేటాయింపు, సాంకేతిక అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వం వేగంగా భూసేకరణ చేపట్టడం వంటి వాటిపై దృష్టి పెట్టింది. నిజంగా ఇది అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక పరిణామం.
