క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక నిబంధనలో మార్పు చోటుచేసుకుంది. గతంలో ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదనే నిబంధన అమల్లో ఉండేది. జనాభా నియంత్రణ లక్ష్యంతో 1994లో తీసుకువచ్చిన ఈ నిబంధన కారణంగా అనేక మంది ఆసక్తి ఉన్నప్పటికీ సర్పంచ్ లేదా వార్డు సభ్యుడిగా బరిలోకి దిగే అవకాశం కోల్పోయేవారు. అయితే, ప్రస్తుత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ నిబంధనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024లో చట్ట సవరణ చేసింది.
ఈ చట్ట సవరణ ద్వారా ఇకపై ఎంత మంది పిల్లలు ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లభించింది. ముఖ్యంగా సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల స్థానాలకు కూడా ఈ సడలింపు వర్తిస్తుంది. గతంలో ఉన్న పరిమితి ఎత్తివేయడంతో పెద్ద కుటుంబాలు ఉన్నవారు కూడా స్థానిక పాలనలో భాగస్వాములయ్యేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం జననాల రేటు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనాభా వృద్ధి రేటులో వస్తున్న మార్పుల దృష్ట్యా పాత నిబంధనను కొనసాగించడం అవసరం లేదని భావించి ఈ వెసులుబాటు కల్పించారు. దీనివల్ల గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్య ప్రక్రియలో మరింత మందికి అవకాశం దక్కడంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గత మూడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఈ నిబంధనను తొలగించడం స్థానిక రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మార్పుగా నిలిచింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి ఈ సవరణ కొత్త ఊపునిచ్చిందని చెప్పవచ్చు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నిబంధనపై ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.
