క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్యతోపాటు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. యాదగిరిగుట్ట దేవస్థానం వరుసగా మూడో ఏడాది కూడా రికార్డు స్థాయి ఆదాయంతో దూసుకుపోతోంది. తెలంగాణలో 200 కోట్లకు పైగా వార్షిక ఆదాయాన్ని సాధిస్తున్న ఏకైక దివ్యక్షేత్రంగా యాదగిరిగుట్ట నిలిచింది. తెలంగాణ ప్రజల ఇలవేల్పుగా ఉన్న స్తంభోద్భవుడు.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ 1300 కోట్ల రూపాయలతో ప్రధాన ఆలయాన్ని పునర్నిర్మించారు. సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ ఆధునికతను జోడించి వెయ్యేండ్ల వరకు చెక్కుచెదరకుండా ఆలయాన్ని కృష్ణ శిలలతో అద్భుతంగా సర్వాంగ సుందరంగా పునర్మించారు. దీంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది.
ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఏకశిఖర వాసుడి సన్నిధికి రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల నుంచి భక్తులు తాకిడి ఎక్కువైంది. ఆలయ పునర్నిర్మాణం కంటే ముందు సాధారణ రోజుల్లో రోజుకు 15 వేల మంది వరకు భక్తులు మాత్రమే దర్శనానికి వచ్చేవారు. ప్రస్తుతం రోజుకు సగటున సుమారు 30 నుంచి 50 వేల మంది వరకు వస్తున్నారు. ఇక పండుగలు, సెలవు రోజుల్లో భక్తుల సంఖ్య లక్ష దాటుతోంది. 2014లో దాదాపు 86 లక్షలుగా ఉన్న వార్షిక భక్తుల సంఖ్య, ప్రస్తుతం 1.02 కోట్లకు పెరిగింది. ఇది ఆలయం పట్ల భక్తుల్లో పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తోంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తర్వాత అత్యంత పవిత్రమైన ప్రసాదంగా యాదగిరిగుట్ట లడ్డూను భక్తులు భావిస్తుంటారు. దీంతో యాదగిరిగుట్ట లడ్డూకు క్రేజ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో సగటున 25 నుంచి 30 వేల లడ్డూలను దేవస్థానం విక్రయిస్తోంది.
సెలవు, పర్వదినాల్లో 40 నుంచి 50 వేల లడ్డూలను దేవస్థానం అమ్ముతోంది. లడ్డూతో పాటు యాదగిరిగుట్ట పులిహోర ప్రసాదానికి కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రతిరోజు రెండు టన్నుల పులిహోరను ఆలయం తయారు చేస్తోంది. ఆధునాతన ఆటోమేటెడ్ పోటు ద్వారా భక్తులకు అవసరమైన ప్రసాదాలను దేవస్థానం అందిస్తోంది. స్వామివారి ప్రసాదానికి భక్తుల నుండి భారీగా డిమాండ్ ఉండడంతో ప్రసాదాలు విక్రయాల ద్వారా ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. 2026 మే నెలలో ప్రసాదాలు విక్రయాల ద్వారా 15.62 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఏడాదిలో నాలుగైదు సార్లు దర్శంచి స్వామి వారి కృపకు పాత్రులవుతూ స్వామివారి సేవలో భక్తులు తరిస్తున్నారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు లడ్డూ ప్రసాదాన్ని తీసుకువెళ్లి బంధువులకు పంచుతారు.